బీహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ప్రమేయం ఉన్న దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు.
కృష్ణయ్య కుటుంబానికి స్మిత బుధవారం సంఘీభావం తెలిపారు. గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సెంట్రల్ ఐఎఎస్ అసోసియేషన్ ప్రకటనను ఆమె రీట్వీట్ చేశారు.
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసినట్లు అభియోగాలు మోపబడిన దోషి విడుదల చేయాలని నిర్ణయించడంపై విస్మయం వ్యకం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషి విడుదల చేస్తే న్యాయాన్ని తిరస్కరించినట్లేనని ఐఎఎస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ నిర్ణయం ప్రభుత్వోద్యోగుల మనోధైర్యాన్ని క్షీణింపజేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బీహార్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా పునఃపరిశీలించాలని అసోసియేషన్ అభ్యర్థించింది.
హైదరాబాద్‌లో నివసిస్తున్న కృష్ణయ్య కుటుంబం, బ్యూరోక్రాట్‌పై దాడికి ప్రేరేపించిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయడంలో జోక్యం చేసుకొని ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు. బీహార్ జైలు మాన్యువల్‌ను సవరించడం ద్వారా మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని హత్యకు గురైన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకుని నితీష్ కుమార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే చేయాలని విజ్ఞప్తి చేశారు.
తన భర్త ఐఏఎస్ అధికారి అని, న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆమె అన్నారు. రాజ్‌పుత్‌ల ఓట్ల కోసం, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన భర్తను చంపిన వ్యక్తిని విడుదల చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అప్పటలో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా విడుదల చేయడంపై కూడా స్మిత సభర్వాల్ స్పందించారు. రేపిస్టులను జైలు నుంచి విడిచి పెట్టడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.