APTELANGANA

హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ. కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 

మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ధాటిగా ఆడింది. ఓపెనర్లు డుప్లేసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.తన సూపర్ ఫామ్ కొనసాగించిన డుప్లేసిస్ 34 బంతుల్లో 1 సిక్స్ , 5 ఫోర్లతో 45 రన్స్ చేయగా…కోహ్లీ 46 బంతుల్లో 5 ఫోర్లతో 55 రన్స్ చేశాడు.

అయితే మాక్స్ వెల్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో యువ బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ధాటిగా ఆడి కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు , 3 సిక్సర్లతో 54 రన్స్ చేశాడు. దినేష్ కార్తీక్ 11 రన్స్ కే ఔట్ అయినా…లోమ్రోర్ జోరుతో బెంగళూరు మంచి స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు.

కాస్త బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై ఫాంలో లేని ఢిల్లీ ఎలా ఆడుతుంది అన్న అనుమానం మధ్య. ఆ జట్టు ఓపెనర్లు దూకుడుగా తమ ఇన్నింగ్స్ ఆరంభించారు. వార్నర్ , ఫిల్ సాల్ట్ తొలి వికెట్ కు 5.1 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. వార్నర్ 22 రన్స్ కే ఔట్ అయినా…సాల్ట్ , మిచెల్ మార్ష్ మాత్రం రెచ్చిపోయారు. భారీ షాట్లతో బెంగుళూరు బౌలర్లపై విరుచుకు పడ్డారు. ముఖ్యంగా సాల్ట్ వరుస బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

అటు మార్ష్ కూడా ధాటిగా ఆడటంతో సాధించాల్సిన రన్ రేట్ తగ్గిపోయింది. మార్ష్ 26 రన్స్ చేయగా…సాల్ట్ కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు , 6 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. చివర్లో సాల్ట్ ఔట్ అయినా…అప్పటికే ఢిల్లీ విజయం ఖాయమయింది. రొస్కు, అక్షర్ పటేల్ ఢిల్లీ విజయాన్ని పూర్తి చేశారు. ఢిల్లీ 16.4 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది నాలుగో విజయం.