ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల సభ్యులు ఒక్క చోట హాజరైనా, కాకపోయినా అది వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపించలేదు. రజనీకాంత్ ను కూడా ఆహ్వానించిన ఈ వేడుకలకు బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీనిపై పెద్ద చర్చే జరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలకు నందమూరి కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబ సభ్యులందరికీ టీడీపీ అధిష్టానం ఆహ్వానాలు పంపుతోంది. అయితే ఇది పార్టీ తరఫున కాకుండా ఎన్టీఆర్ శతజయంతి కోసం ఏర్పాటు చేసిన కమిటీ తరఫున ఈ ఆహ్వానాలు అందుతున్నాయి.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణ కోసం టీడీపీ అధిష్టానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టీడీపీలో చంద్రబాబు ఆత్మగా పిలుచుకునే మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ను ఛైర్మన్ గా పెట్టారు. ఆయన ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఆహ్వానించే పనిలో ఉన్నారు. ఇవాళ ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ఇంటికెళ్లి మరీ ఆహ్వాన పత్రిక అందజేశారు. విజయవాడలో జరిగిన వేడుకలకు జూనియర్ ను ఆహ్వనించకపోవడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకుంది.
అలాగే ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురంధేశ్వరిని సైతం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమెకు కూడా ఇంటికి వెళ్లి టీడీ జనార్ధన్ ఆహ్వాన పత్రిక అందజేశారు. దీంతో పురంధేశ్వరి కూడా హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులకు కూడా ఈ ఆహ్వానాలు అందబోతున్నాయి. దీంతో హైదరాబాద్ సభకు నారా, నందమూరి కుటుంబాలు కలిసి హాజరుకానున్నారు.