TELANGANA

ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం

ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్‌లో నివసించే సయ్యద్ హబీబుద్దీన్, శశిరేఖ దంపతులకు రేఖ అనే రెండేళ్ల చిన్నారి ఉంది. శశిరేఖ బ్యూటీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సేవలందించేందుకు మన్సూరాబాద్‌కు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో భర్త హబీబుద్దీన్, కుమార్తెతో కలిసి ఎన్టీఆర్ నగర్‌కు బయల్దేరారు.

గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కామినేని హాస్పిటల్ మార్గంలో ఆగివున్న ఓ కారు డోర్‌ను డ్రైవర్ హఠాత్తుగా తెరవడంతో వెనుక నుంచి వస్తున్న వీరి బైక్‌కు తగిలింది. దీంతో ముగ్గూరు రోడ్డుపై పడిపోయారు. చిన్నారి తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ధనలక్ష్మి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.