సికింద్రాబాద్: సాయినాథుణ్ని దర్శించుకోవడానికి షిర్డీ వెళ్లే భక్తుల రద్దీ భారీగా ఉంటోంది. రోజువారీ రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి నాగర్‌సోల్‌కు ఆరు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సీహెచ్ రాకేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07517 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు నాగర్‌సోల్‌కు చేరుకుంటుంది. ఈ నెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 10 గంటలకు బయలుదేరే నంబర్ 07518 ప్రత్యేక రైలు- మరుసటి రోజు ఉదయం 10:50 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లిలో హాల్ట్ సౌకర్యం ఉంది. శంకర్‌పల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భాల్కి, ఉద్గిర్, లాతూర్ రోడ్, పార్లీ వైద్యనాథ్, గంగాఖేర్, పర్భాణి, మన్వత్ రోడ్, సేలు, జాల్నా, ఔరంగాబాద్, రోటేగావ్ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఆయా స్టేషన్లల్లో వీటికి హాల్ట్ సౌకర్యాన్ని కల్పించినట్లు సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు.
ఏసీ సెకెండ్ కమ్ త్రీ-టయర్, ఏసీ టూ టయర్, ఏసీ త్రీ టయర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకెండ్ క్లాస్ బోగీలను అమర్చినట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. షిర్డీ వెళ్లే సాయినాథుడి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్ల సంఖ్యను పొడిగించే అవకాశాలు లేకపోలేదు. రద్దీ అధికంగా ఉంటే జులైలోనూ మరిన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపించవచ్చు.