బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు.
తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ వసతిని కల్పిస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చినట్టే- అధికారంలోకి వచ్చిన సరిగ్గా నెలరోజుల్లోనే దీన్ని అమలు చేసింది. ఈ నెల 11వ తేదీన లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికి శక్తి అని పేరు పెట్టింది. ఈ పథకం కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌డబ్ల్యూ ఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక/నార్త్ ఈస్ట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఈశాన్య ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
రాజహంస, వజ్ర, వాయు వజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్‌టి బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. మహిళలు పెద్ద సంఖ్యలో వారంతపు రోజుల్లో ఉచితంగా ప్రయాణిస్తోన్నారు. ధర్మస్థల, కుక్కె సుబ్రహ్మణ్యం, మురుడేశ్వర్, హంపి, మైసూరు, మలే మహదేశ్వర బెట్ట.. వంటి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్తోన్నారు.
ఫలితంగా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. అడుగు మోపే స్థలం కూడా ఉండట్లేదు. మహిళా ప్రయాణికుల ధాటికి ఆర్టీసీ బస్సులు సైతం తట్టుకోలేకపోతోన్నాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మలే మహదేశ్వర బెట్టకు వెళ్లే బస్సు దీనికి ఉదాహరణ. డోర్ పట్టుకుని బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన క్రమంలో అది విరిగి చేతికొచ్చింది. అయినా ప్రయాణం మాత్రం మానలేదు. బస్సును అలాగే నడిపించాలంటూ పట్టుబట్టారు.