హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT) అధికారులు 10వ తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై రాజ్యాంగ పీఠికను ముద్రించింది.
అయితే, కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు అదృశ్యమయ్యాయి. గత ఏడాది పీఠిక సరిగ్గా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ఆ పదాలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలపై ఈ పీఠిక ఉంది. ఆ రెండు పదాలను తొలగించడంపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు, సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాగా, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను చేర్చారు. ఈ ఏడాది సిలబస్ మారలేదు. బుక్ తయారు చేసే ఎడిటోరియల్ సభ్యుల బృందంలోనూ మార్పులు లేవు. కానీ, రీ డిజైన్ పేరుతో కవర్ పేజీలను మార్చారు.
ఈ క్రమంలోనే కనీస అవగాహన లేకుండా ఇంటర్నెట్ నుంచి రాజ్యాంగ సవరణకు ముందున్న పీఠికను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ చేశారు. కనీసం మరోసారి తనిఖీ చేయకుండా ప్రింట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికమండేషన్ల ద్వారా వచ్చినోళ్లతో ఎస్ఈఆర్టీ నిండిపోయిందని.. ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, పెక్యులర్ పదాలు లేకుండా కవర్ పేజీ ప్రింట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి, టీపీటీఎఫ్ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ రవీందర్ డిమాండ్ చేశారు. కావాలనే ముద్రించినట్లు అనుమానం వస్తోందని.. తప్పుడు ముద్రణకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది ఇలావుండగా, సోషల్ స్టడీస్ కవర్ పేజీలపై సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేని పీఠికను ముంద్రించడం కావాలని చేసింది కాదని.. ఈ తప్పునకు తనదే బాధ్యత అని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి అన్నారు. సబ్జెక్ట్ కమిటీ బుక్‌లో ఉన్న పాఠాలున చెక్ చేసింది.. కానీ, కవర్ పేజీపై ఉన్న పీఠికను గమనించలేదన్నారు. ఈసారి కవర్ పేజీ, లోపలి పేజీలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు పేజీలను రీ డిజైన్ చేశామని.. ఈ క్రమంలోనే వెబ్‌సైట్ నుంచి పాత పీఠికను డౌన్ లోడ్ చేసి పెట్టడం వల్లే పొరపాటు జరిగిందని రాధారెడ్డి వివరణ ఇచ్చారు.