హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. బీఆర్ఎస్ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకించి- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
బీఆర్ఎస్‌ను బందిపోట్ల రాష్ట్ర సమితిగా అభివర్ణించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టారు. తండ్రి పేరు చెప్పుకొని పదవులను అనుభవిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేశారామె. తన రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుందని షర్మిల ఎద్దేవా చేశారు. తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవించేది కేటీఆర్ అయితే, తండ్రి చూపించిన సంక్షేమ పాలన కోసం ఒంటరి పోరు చేసింది తానేనని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని చెప్పారు.
కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక బంది పోట్ల రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల అవినీతిపై పోరాటం సాగించానని షర్మిల అన్నారు. పోడు భూముల కోసం కొట్లాడానని, నిరుద్యోగుల కోసం అంతులేని పోరాటం చేశానని పేర్కొన్నారు. ఎన్నో ప్రజా ఉద్యమాలు తెలంగాణ ప్రజల కోసం తాము చేస్తే అధికారంలో ఉన్న చిన్న దొర కేసీఆర్ ఏం సాధించారంటూ నిలదీశారు.