TELANGANA

రాజకీయ కోణంలో ఉస్మానియా ఆసుపత్రి పరిశీలనకు రాలేదు- గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఉస్మానియా ఆస్పత్రిపై సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తుండగానే, గవర్నర్‌ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించడం చర్చనీయాంశమైంది.

ఉస్మానియా పురాతన భవనమైన కులి కుతుబ్ షా బ్లాక్ ను గవర్నర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించి రోగుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నట్లు గవర్నర్ తమిళి సై చెప్పారు. అయితే గవర్నర్ ఉస్మానియా ఆసుపత్రి తనిఖీకి వచ్చినప్పుడు ఉస్మానియా సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ హాజరైనట్లు సిబ్బంది తెలిపారు.

రాజకీయ కోణంలో రాలేదు

ఉస్మానియా ఆసుపత్రి విషయంలో చొరవ చూపిన కోర్టును అభినందిస్తున్నట్లు గవర్నర్ తమిళి సై అన్నారు. ఆసుపత్రిలో టాయిలెట్లు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు రెండు వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారని, ఆసుపత్రి పైకప్పు పెచ్చులు పడి రోగులు బాధపడుతున్నారని ఆక్షేపించారు. కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రోజుకు రెండు వందల వరకు సర్జరీలు చేస్తారన్నారు. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదని అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. వందల ఏళ్ల నాటి భవనం కాబట్టి, కొన్ని చోట్ల పెచ్చులు ఊడుతున్నాయన్నారు. జనరల్‌ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నామని రోగులు వాపోతున్నారని గవర్నర్ తెలిపారు. రాజకీయ కోణంలో ఉస్మానియా ఆసుపత్రి పరిశీలనకు రాలేదని తమిళిసై అన్నారు. తనపై విమర్శలు చేయడంలో పెట్టే శ్రద్ధ నూతన భవనం కట్టడంలో ఉండాలని కోరారు.

ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిపై ట్వీట్

గవర్నర్ తమిళి సై ఉస్మానియా ఆసుపత్రిపై ఇటీవల ట్వీట్ చేశారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళన కలిగిస్తుందన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ పేరుతో ఓ ట్విటర్‌ ఖాతా పోస్టు రీట్వీట్ చేశారు. ఆస్పత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటోలు, కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లెటర్ ను ట్వీట్‌ చేశారు. ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ చేసిన ట్వీట్‌ను గవర్నర్‌ తమిళిసై రీట్వీట్‌ చేస్తూ ఆస్పత్రి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందని గుర్తుచేశారు. ఆసుపత్రి నూతన భవనాన్ని తొందరగా నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు.