తెలంగాణ బీజేపీలో అగ్గిరాజుకుంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లుగా పార్టీ కోసం తాను కష్టపడుతుంటే పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన…బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ అధ్యక్షుడు మారిపోతున్నాడంటూ వస్తున్న వార్తలు వాస్తవమేనన్నారు. మునుగోడు ఉపఎన్నికలో వంద కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ గెలవలేదన్నారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని, పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ పదవిలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇవ్వాలని కోరారు. దుబ్బాకలో తన విజయాన్ని చూసిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో వచ్చారన్నారు.
నా కులమే శాపంగా మారింది
బీజీపే రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కాదా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కొన్ని విషయాల్లో నా వెలమ కులమే నాకు శాపం మారిందన్నారు. దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరూ చూస్తారన్నారు. దుబ్బాక ఎన్నికల్లో తనకెవరూ సాయం చేయలేదన్నారు. తాను బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. బండి సంజయ్ ది స్వయంకృతాపరాథం అని విమర్శించారు. బండి సంజయ్ పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. అలాంటి ఆయన రూ. 100 కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో తెలంగాణలో ఓట్లు పడవని తేల్చిచెప్పారు. రఘునందన్, ఈటల బొమ్మలతోనే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. తన సేవలను గుర్తించకపోతే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అపాయింట్మెట్ ఇస్తే అన్నీ చెప్తా
ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశం అని రఘునందర్ అన్నారు. బీజేపీకి శాసనసభాపక్ష నేత లేడని జేపీ నడ్డాకు తెలియదన్నారు. ఈ విషయం వాళ్ల దృష్టికి తీసుకెళ్తే, చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో అధిష్టానం అపాయింట్మెట్ కోసం ఎదురుచూస్తున్నానని రఘునందర్ తెలిపారు. ఎవరైనా కలిసే అవకాశం ఇస్తే పార్టీలో పరిణామాలతో పాటు అనేక అంశాలను అధిష్ఠానం ముందు ఉంచుతానన్నారు. తాను పదేళ్లుగా కష్టపడుతున్నాను కాబట్టి దానికి కూలీ అడుగుతున్నానని ఎమ్మెల్యే రఘునందర్ రావు అన్నారు.