TELANGANA

మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా అందాలంటే – తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయిదు పథకాలకు సంబంధించి దరాఖాస్తులను స్వీకరించేందుకు మార్గదర్శకాలు సిద్దం చేసింది. రేషన్ కార్డులు లేని వారి నుంచి సమాచారం సేకరిస్తోంది. ప్రజలు ఒక్కో పథకానికీ ఒక్కొక్కటి చొప్పున వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నింటికీ కలిపి ఒకే దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించింది.

 

దరఖాస్తుల స్వీకరణ: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో.. ఐదింటినీ తొలివిడత ప్రజాపాలనలో అమలుచేయాలని నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు దశలవారిగా, నిర్ణీత క్యాలవ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలు అమలుచేయడానికి నాలుగు నెలలకోసారి ప్రజా పాలన నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి ప్రజాపాలన కార్యక్రమం 28 నుంచి ప్రారంభం కాబోతోంది. జనవరి ఆరో తేదీ వరకూ మొత్తం 8 పని దినాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీలో, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్‌ వార్డులో.. ఐదు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకుంటారు. రేషన్‌కార్డు ఉంటే.. ఆ వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి. లేనివారు ఆ విషయాన్నే దరఖాస్తులో రాస్తే.. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని రేషన్‌ కార్డు కూడా జారీచేస్తారు. ఈ దరఖాస్తును కూడా రాష్ట్రస్థాయిలో రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు.

 

ప్రత్యేక కౌంటర్లు: ఈ నెల 28వ తేదీ నుంచి ఐదు పథకాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అవి.. మహాలక్ష్మి (మహిళలకు నెలకు రూ.2,500 నగదు బదిలీ), గృహజ్యోతి (రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌), ఇందిరమ్మ ఇల్లు (ప్రతి లబ్ధిదారునికీ రూ.5 లక్షలు), చేయూత (నెలకు రూ.4 వేల పింఛను), రైతు భరోసా (ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు) పథకాల అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేసారు.

 

ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించటానికి ముందు రోజు.. ఆ గ్రామపంచాయతీ, మున్సిపల్‌ వార్డు పరిధిలో దండోరా వేయించి ప్రచారం నిర్వహించాలి. అలాగే.. మహిళల కోసం ప్రకటించిన పథకాలే ఎక్కువ ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తులు స్వీకరించడానికి మహిళలకు కనీసం రెండు కౌంటర్లు, పురుషులకు ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించింది.

 

గ్రామ సభల్లో ఎంపిక: ప్రజాపాలన ఈనెల 28 తేదీ నుంచి మొదలవుతుండగా.. 27 తేదీ నాటికి జిల్లా, డివిజన్‌ స్థాయి సమావేశాలు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశాలు ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్‌ నిర్వహిస్తారు. ఆదివారం ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్‌చార్జి మంత్రులను కూడా నియమించారు. వీరి అధ్యక్షతన 27లోపు జిల్లాస్థాయిలో సమావేశాలు పూర్తిచేయాల్సి ఉంటుంది.

 

నియోజకవర్గ స్థాయిలో నోడల్‌ ఆఫీసర్‌ను నియమించి, వారితో కార్యక్రమ పర్యవేక్షణ చేయించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కౌంటర్లలో సిబ్బంది దరఖాస్తులు స్వీకరించడానికి ముందు.. అన్ని వివరాలూ ఉన్నాయో లేదో పరిశీలించాలని, ఆధార్‌, తెల్ల రేషన్‌కార్డు వంటివాటి వివరాలన్నీ వాటిలో ఉండేలా చూడాలని సూచించారు. దరఖాస్తు స్వీకరించాక వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.