TELANGANA

రాహుల్ గాంధీ కారులో భట్టి, పార్టీలోని పరిస్థితులపై మంతనాలు!

ఖమ్మం సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సభ నిర్వహణ పైన రాహుల్ గాంధీ ఖుషీ అయ్యారని నేతలు తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను భజం తట్టి అభినందించారు రాహుల్ గాంధీ.

లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సభ ముగిసిన తరువాత గన్నవరం వరకు రాహుల్ తో పాటుగా భట్టి విక్రమార్క ఒకే కారులో వెళ్లారు. ఈ సమయంలో పార్టీ గురించి రాహుల్ కీలక సూచనలు చేశారు.

నేతలంతా ఒకే చోట

ఖమ్మం సభలో నేతలంతా ఒకే చోట, కార్యకర్తలంతా ఒకే సభ అనే విధంగా నిర్వహించటంపైన రాహుల్ హర్షం వ్యక్తం చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆదివారం గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న తరువాత రాహుల్ సభా ప్రాంగణానికి చేరుకొనే సమయానికి ఆ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తలు..జెండాలతో నిండిపోయింది. సభలో రాహుల్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ తో పొత్తు పైన జరుగుతున్న ప్రచారానికి రాహుల్ ముగింపు పలికారు. బీజేపీకి బీ టీమ్‌గా మారారన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ (బంధుత్వ) సమితి అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ లేదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ అని రాహుల్ ప్రకటించారు.

అధికారం ఖాయమని రాహుల్ ధీమా

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. సభలో మాట్లాడిన భట్టి తన పాదయాత్ర అనుభవాలను వివరించారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిలబడుతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఖాయమని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో కారులో ప్రయాణించిన భట్టి… క్షేత్ర స్థాయిలో అంశాలు, పార్టీలోని పరిస్థితులపై భట్టి వివరించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర, ఖమ్మం సభ నిర్వహణ పైన భట్టిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా తొలి అడుగు పడిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.