National

మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు

మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వం కుకీ గ్రూపులకు హామీ ఇచ్చింది, అయితే మణిపూర్ లో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే రాజకీయంగా పరిష్కారాన్ని సాధించగలమని కేంద్ర ప్రభుత్వం కుకీలకు స్పష్టం చేసింది.

ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్, మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సభ్యులు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్ తపన్ కుమార్ దేకాతో జూలై 7న రాజధానిలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయమైన నార్త్ బ్లాక్‌లో సమావేశమయ్యారు.

మే 3 నుండి రెండు కులాల హింస మణిపూర్ అల్లకల్లోలం అయ్యింది. కుకీలు, మెయిటీ కులాలకు చెందిన పౌర సమాజ సమూహాలతో కేంద్ర ప్రభుత్వం బ్యాక్ డోర్ చర్చలు జరుపుతోంది. మణిపూర్ హింసలో 140 మందికి పైగా మరణించారు. దాదాపు 60,000 మంది నిర్వాసితులయ్యారు. జూన్ 1న హోంమంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించారు. మణిపూర్ గవర్నర్ నేతృత్వంలోని శాంతి చర్చలు జరిగినా ఇంకా హింస చల్లారలేదు.

శుక్రవారం బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తాజా హింసలో ముగ్గురు చనిపోయారు. అనుమానిత సాయుధ దుండగులు శుక్రవారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో ఫౌగాక్‌చావో ఇఖాయ్ అవాంగ్ లైకై, క్వాక్తా ప్రాంతాలపై కాల్పులు జరిపగా ఓ వ్యక్తి చనిపోయాడు. పోలీసులు, భద్రతా బలగాలు దుండగులను తిప్పికొట్టాయి. ఐదుగురు అనుమానిత సాయుధ దుండగులకు బుల్లెట్ గాయాలు అయ్యాయని, ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు.

ఐబి అధికారులతో కుకీ గ్రూపుల సమావేశానికి హాజరైన ఓ వ్యక్తి ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం దీర్ఘకాలిక, తాత్కాలిక పరిష్కారాలపై చర్చలు జరుపుతోందని అన్నారు. హింస చెలరేగినప్పటి నుండి కుల సంఘాల కోసం ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 24 కుకీ తిరుగుబాటు గ్రూపులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.