National

వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధికి గుండెపోటు- హెల్త్ అప్ డేట్ ఇదే.

కృష్ణాజిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి ఇవాళ గుండెపోటుకు గురయ్యారు. ఉదయం ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తరలించారు.

వెంటనే అత్యవసర చికిత్స అందించిన డాక్టర్లు ఆయన ప్రాణం కాపాడారు. అనంతరం యాంజియోగ్రామ్ టెస్ట్ నిర్వహించి స్టెంట్ కూడా వేసినట్లు తెలుస్తోంది.

స్టెంట్ వేసిన తర్వాత పార్ధసారధి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊరట పొందారు. అంతకుముందు స్ధానికంగా వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న పార్ధసారధి అస్వస్ధతకు గురయ్యారనే సమాచారంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా ఆయన తండ్రి కొలుసు పెద రెడ్డయ్య చనిపోయారు. అప్పటి నుంచి పార్ధసారధి కూడా కాస్త డల్ అయ్యారు. అయితే ఎన్నికల నేపథ్యంలో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇవాళ అస్వస్ధతకు గురయ్యారు.

గతంలో వైఎస్ హయాంలో పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన పార్ధసారధి.. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు.తిరిగి 2019లో జగన్ హవాలో తిరిగి అదే పెనమలూరు నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. జగన్ కేబినెట్లో స్ధానం దక్కుతుందని భావించినా నిరాశ తప్పలేదు. అయినా పార్ధసారధి మౌనంగానే పనిచేసుకుపోతున్నారు.