TELANGANA

సాయిచంద్ భార్యకు గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్; కోటిన్నర ఆర్ధికసాయం!!

తెలంగాణ రాష్ట్ర గిడ్దంగుల సంస్థ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సాయిచంద్ సతీమణి రజనిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అలు పెరుగని పోరాటం చేసిన సాయి చంద్ గుండెపోటుతో ఇటీవల మరణించడంతో, గిడ్డంగులసంస్థ చైర్ పర్సన్ గా ఉన్న భర్త స్థానంలో భార్య రజనీకి అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

సాయి చంద్ లేకున్నా రజనీకి గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించి సాయి చంద్ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఈ నిర్ణయం ద్వారా తెలియజేశారు.కార్పోరేషన్ ఛైర్ పర్సన్ తోపాటుగా సాయి చంద్ గారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ కోటిన్నర రూపాయలు అందిస్తాం అని ఈ మేరకు తెలంగాణా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సాయి చంద్ సతీమణి రజనీని పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. సాయి చంద్ సతీమణి రజిని భర్త కోసం కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర ఆవేదనకు గురి అవుతుంది. ఇటీవల ఆమెకు గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స కూడా అందించారు.

ఆమె ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల నీరసించి, ఒత్తిడి వల్ల గుండె నొప్పి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆమె విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారు. అయినప్పటికీ భర్త కోసం సాయి చంద్ సతీమణి రజని రోదిస్తున్న తీరు చూసిన వారందరినీ కంటతడి పెట్టిస్తుంది. నిన్న ఎమ్మెల్సీ కవిత రజనీని పరామర్శించడానికి వెళ్ళిన క్రమంలో ఆమె బోరున రోదించడంతో, ఎమ్మెల్సీ కవిత సైతం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ సాయి చంద్ భార్య సతీమణికి గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా అవకాశం ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడంలో సీఎం కెసిఆర్ ఔదార్యం గొప్పదని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.