TELANGANA

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో శుక్రవారం, శనివారం ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు.

జులై 9న ఇంజినీరింగ్ అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు గడువు జులై 12 వరకు పొడిగించారు. జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6930 సీట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, కొత్తగా 7635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది.

ఫలితంగా అదనపు సీట్లతో ప్రతి సంవత్సరం ప్రభుత్వంపై రూ. 27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. తాజాగా అనుమతిచ్చినవాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.

నేడే ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలకు రంగం సిద్ధమైంది. సమాధాన పత్రాల మూల్యంకనం పూర్తి చేసిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. జూన్ 14 నుంచి జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70వేల మంది విద్యార్థులు రాశారు.

మరోవైపు, తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు కూడా శుక్రవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వరకు జరిగాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 5 నుంచి 9 వరకు నిర్వహించారు.