TELANGANA

మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్

హైదరాబాద్: మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజ్జులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత గురువారం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 1న తనకు తాను సామాజిక కార్యకర్తనంటూ.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వీసీకి తెలిపారు. తనకు సన్మానం చేయాలని వీసీకి హుకుం జారీ చేశారు. అయితే, మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆర్థికంగా సహకరించాలని వీసీ ఆయనను కోరారు.

ఈ క్రమంలో తాను గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెబుతూ.. వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీనివాస్. ‘నువ్వేమైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అనుకుంటున్నా? వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కాయి’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్‌పై వీసీ.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పోలీసులపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌​లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా ఉండడానికి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మానవ హక్కుల కమిషన్‌​కు ఛైర్మన్, సభ్యులు లేకుండా చేశారని కేఏ పాల్ ఆరోపించారు. ధరణిని తీసుకువచ్చి తమ ఛారిటీ భూములను ఆగం చేశారని ఆరోపించారు.

6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందని.. వారం రోజుల్లో మానవ హక్కుల కమిషన్.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు, సభ్యులను నియమించాలని కోరారు. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న సదాశివపేట పోలీసులను సస్పెండ్ చేయాలని.. హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు చేసినట్లు పాల్ తెలిపారు.