హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు.
ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేస్తోంది.
ఇందులో భాగంగా మిజోరం మిగిలిన నాలుగు రాష్ట్రాలకూ ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. సీనియర్లను బరిలోకి దింపింది. వారికి కీలక బాధ్యతలను అప్పగించింది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఒక్కో స్టీరింగ్ కమిటీలో అయిదు నుంచి ఎనిమిది మందిని సభ్యులుగా నియమించింది.
తెలంగాణలో ఏర్పాటైన స్టీరింగ్ కమిటీకి పార్టీ సీనియర్ నేత కే మురళీధరన్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. బాబా సిద్ధిక్, జిగ్నేష్ మేవాణీ ఇందులో సభ్యులు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, లోక్సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ కమిటీకి ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులందరికీ చోటు కల్పించింది.
రాజస్థాన్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్గా గౌరవ్ గొగొయ్, మధ్యప్రదేశ్- జితేంద్ర సింగ్, ఛత్తీస్గఢ్- అజయ్ మాకెన్ అపాయింట్ అయ్యారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలను సభ్యులుగా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు.