TELANGANA

ఆదిభట్ల కిడ్నాప్ నిందితుల అరెస్ట్…కథ సుఖాంతం.

రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. యువతిని సేఫ్‌గా రక్షించారు. పదిగంటలకు పైగా యువతి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళనలతో ఆదిభట్ల అట్టుడుకింది. అయితే తాను మన్నెగూడలోనే ఉన్నట్టు బాధిత యువతి తన తండ్రి దామోదర్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. లొకేషన్‌ ఆధారంగా స్పాట్‌ చేరుకున్న పోలీసులు బాధిత యువతిని సేఫ్‌గా రక్షించారు. కిడ్నాపర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. యువతి కిడ్నాప్‌ వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తనని కాదని మరో వ్యక్తితో యువతికి వివాహం చేస్తున్నారని కక్ష పెంచుకున్న నవీన్‌రెడ్డి కిడ్నాప్‌ స్కెచ్‌ వేశాడు. సరిగ్గా యువతికి మరోవ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన రోజునే తన స్కెచ్‌ అమలు చేశాడు. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన దాదాపు వందమందికిపై కిరాయి గూండాలు యువతి ఇంటిపై దాడి చేశారు. యువతిని బలవంతంగా వాహనం ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఈ క్రమంలో యువతి ఇంట్లోని ఫర్నీచర్‌, సీసీ కెమెరాలు, వాహనాలను ధ్వంసం చేసి యువతిని కిడ్నాప్‌ చేశారు.

ఈ క్రమంలో అడ్డొచ్చినవారిపైనా దాడి చేశారు. నవీన్‌రెడ్డితో పెళ్లి ఇష్టం లేదని బాధిత యువతి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వయంగా మెజిస్ట్రేట్‌ ముందు తనకు పెళ్లి ఇష్టం లేదని.. నవీన్‌రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నాడంటూ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చింది. అయితే తనకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేస్తానంటూ బాధిత యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను నవీన్‌రెడ్డి బెదిరించాడు. దీనిపై ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని యువతి పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు. తనను ప్రేమించడం లేదన్న కక్షతో ఆరునెలలుగా కక్ష పెంచుకున్న నవీన్‌రెడ్డి పథకం ప్రకారమే… యువతి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని టీ స్టాల్‌ ఏర్పాటు చేశాడు. యువతి కోసం ఆరునెలలుగా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. టీ స్టాల్‌కు వచ్చేవారితో పాటు కొంతమంది స్టూడెంట్స్‌కు డబ్బులు ఇచ్చి యువతిని కిడ్నాప్‌ చేయించాడు. కిడ్నాప్‌ అనంతరం యువతిని నవీన్‌రెడ్డి అప్పగించిన యువకులు ఆ తర్వాత పరారయ్యారు. పథకం ప్రకారం ఎవరికీ దొరకకుండా సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశారు. అంతేకాదు..ఎలాంటి ఆధారాలు లభించకుండా యువతి ఇంటిపక్కనె ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌ సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. తమ కూతురు వెనుక కొంతమంది స్థానికుల ప్రమేయం కూడా ఉందని బాధిత యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన తర్వాత ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నవీన్‌రెడ్డి టీస్టాల్‌ను తగలబెట్టారు. అనంతరం జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. యువతిని తీసుకెళ్తున్న సమయంలో పోలీసులకు సమచారం ఇచ్చినా స్పందించలేదని ఆరోపించారు. తమ కూతురు కిడ్నాప్‌నకు సీఐ నిర్లక్ష్యమే కారణమని, గతంలోనే ఫిర్యాదు చేసినా తమనే తిట్టారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. యువతి వైశాలి రక్షించిన పోలీసులు ఆమె తల్లిదండ్రుల ఆరోపణలపై స్పందించాల్సి ఉంది.