బీఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసే దిశగా మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. భారత రాష్ట్ర సమితిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని గులాబీ శ్రేణులకు సూచించారు మంత్రి కేటీఆర్. గ్రామస్థాయి వరకూ బలోపేతం చేస్తూ 60 లోల మంది పార్టీ కార్యకర్తలను చైతన్య పరిచేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ప్రణాళిక రూపొందించింది. పార్టీలో పనిచేసే కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నేతల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఆత్మీయ సమ్మేళనాల ఏర్పాటుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్. వీలయితే ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకుని ఎమ్మెల్యేలు..పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. బీఆర్‌ఎస్ జిల్లాల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలన్నారు సూచించారు. రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలన్నీ ప్రారంభించుకోవాలన్నారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు, ఏప్రిల్ 25న నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు.