తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్‌స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కించుకుంది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ వేదికపైకి వెళ్లి అవార్డును స్వీకరించారు.
“నా మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్.ఆర్.ఆర్ గెలవాలి. ఇది ప్రతి ఇండియన్‌కి గర్వకారణం. ఆర్‌ఆర్‌ఆర్.. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. RRR దేశాన్ని గర్వపడేలా చేసింది.” అని అవార్డు అందుకున్న అనంతరం కీరవాణి బావోద్వేగంతో మాట్లాడారు.
–ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఐదు పాటలు నామినేట్ అయ్యాయి. –దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీలోని నాటు- నాటు –బ్లాక్ పాంథర్ వకాండా చిత్రంలోని లిఫ్ట్ మీ అప్ సాంగ్..బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. ఈ పాటను ప్రముఖ గాయని రిహన్నా ఆలపించారు. ఇక టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ సినిమాలోని అప్లాజ్ పాట కూడా ఆస్కార్ బరిలో నిలిచింది. అమెరికన్ రచయిత డయాన్ వారెన్ రాసిన పాటను సోఫియా కార్సన్ పాడారు. ఇక ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంలోని..దిస్ ఈజ్ ఏ లైఫ్ పాట కూడా ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇక ప్రముఖ అమెరికా గాయని లేడీ గాగా పాట హోల్డ్ మై హ్యాండ్ కూడా నాటునాటుకు సవాల్ విసిరింది. ఐతే మన పల్లె పాట నాటునాటు ఆస్కార్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ పాటను ప్రముఖ కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. చంద్రబోస్ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
తొలుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆస్కార్ అవార్డ్స్ వేదికపై హోస్ట్ గా మెరిశారు. బ్లాక్ డ్రెస్ లో ఆస్కార్ వేదికపై మెరుపులు మెరిపించారు. దీపికా నాటు నాటు సాంగ్ గురించి అనౌన్స్ చేయగానే డాల్బీ థియేటర్..ఈలలు, కేరింతలతో మార్మోగిపోయింది. నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్‌కు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలను వేదికపైకి ఇన్వైట్ చేశారు దీపికా పదుకొనె. పెర్సిస్ ఖంబట్టా, ప్రియాంకాచోప్రా తర్వాత ఆస్కార్ అవార్డ్స్ హోస్ట్ చేసిన థర్డ్ ఇండియన్‌గా రికార్డ్ సృష్టించారు దీపికా.
ఆ తర్వాత నాటు నాటు లైవ్ ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. ఇండియన్ ట్రెడిషనల్ వేర్ లాల్చీ పంచకట్టులో ప్రపంచ వేదికపై నాటు నాటు పాటను ఆలపించారు. ఆస్కార్ వేదికపై హుషారెత్తించే పల్లెపాటతో ఉర్రూతలూగించారు. ఇక నాటునాటుకు వెస్ట్రన్ డ్యాన్సర్స్‌తో కలిసి..అమెరికా నటి గాట్లీబ్ స్టెప్పులేశారు. నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్‌కు ఆస్కార్స్‌లో స్టాండింగ్ ఒవేషన్ లభించింది.