APTELANGANA

శంషాబాద్ విమానాశ్రయం కొత్త నిబంధనలు: తెలుసుకుని వెళ్లండి

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా భద్రతా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

విమానాశ్రయం ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా సంస్థలు సెక్యూరిటీని అప్రమత్తం చేశారు.

విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే స్టూడెంట్స్ తమ వెంట సెండాఫ్ ఇవ్వడానికి ముగ్గురిని మాత్రమే తీసుకురావాలని.. ఎక్కువ మందిని తీసుకువస్తే లోపలికి రావడానికి పర్మిషన్ ఉండదని అదికారులు స్పష్టం చేశారు. సీఐఎస్ఎఫ్ స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. దీంతో విమానాశ్రయానికి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అధికారులు లోనికి అనుమతిస్తారు.

అంతేగాక, శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో సందర్శకులకు కూడా అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 28వ తేదీ వరకు సందర్శకులను అనుమతించబోమని పేర్కొన్నారు. మరోవైపు, విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం యాక్సెస్ రోడ్డు, ర్యాంపులలో రద్దీ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళుతున్నవారి వెంట ఎక్కువ సంఖ్యలో బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు రావద్దని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సూచించారు. ఒక ప్రయాణికుడి వెంట 10 నుంచి 15 మంది వరకు వస్తుండటంతో ఎయిర్ పోర్టులో రద్దీ పెరుగుతోందన్నారు. దీంతో సెక్యూరిటీ సమస్యతోపాటు పార్కింగ్ సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. అందుకే, ఒక ప్రయాణికుడి వెంట ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఎయిర్ పోర్టుకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్లే ప్రయాణికులు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.