హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్.. రాజకీయ ఆరంగేట్రం దాదాపు ఖరారైనట్టే. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటోన్నారు.
తాను రాజకీయాల్లో ప్రవేశిస్తానంటూ గతంలో స్వయంగా ప్రకటించిన చీకోటి.. ఈ దిశగా తన చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఉదయం దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ పెద్దలను కలుసుకున్నారు. వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌ను కలిశారు. అనంతరం డీకే అరుణతోనూ భేటీ అయ్యారు. బీజేపీలో చేరాలనే తన అభిప్రాయాన్ని వారికి వివరించారు.
ఇప్పటికిప్పుడు బండి సంజయ్ నుంచి చీకోటి ప్రవీణ్‌కు ఎలాంటి హామీ లభించలేదని చెబుతున్నారు. బీజేపీ అధిష్ఠానంతో మాట్లాడాల్సి ఉందని ఆయన వివరించినట్లు సమాచారం. కేసులను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చీకోటి ప్రవీణ్‌ను పార్టీలోకి తీసుకుంటే.. చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తోంది.
వీడియో: ఏపీలో వింత ఘటన- చెట్టు నరుకుతుండగా
అదే సమయంలో చీకోటి ప్రవీణ్ చేరికకు బండి సంజయ్ పచ్చజెండా ఊపారనే వాదనలు కూడా లేకపోలేదు. త్వరలోనే పార్టీ పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారనీ చెబుతున్నారు. బీజేపీలో చీకోటి ప్రవీణ్ చేరిక లాంఛనమేనని, దీనికి అవసరమైన ముహూర్తాన్ని చూసుకుంటోన్నారని తెలుస్తోంది.
రాజకీయాల్లో ప్రవేశిస్తానంటూ ఇదివరకే చీకోటి ప్రవీణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ పార్టీలో చేరతానేది ఇప్పట్లో వెల్లడించలేనంటూ గతంలో చెప్పారు. క్యాసినో ఆర్గనైజర్‌గా గుర్తింపు పొందిన చీకోటి ప్రవీణ్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను సైతం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోకి ఆయనను అనుమతిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.