హైదరాబాద్: రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల మందికి పైగా మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారు.
వారిలో 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేశారు.
ఒక్కో రీజియన్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో తొలి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. ప్రథమ బహుమతిగా 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ 10,000 రూపాయల మొత్తాన్ని వారికి అందజేశారు. మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. వారికి నగదు పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడారు. రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా ఇచ్చిన స్పూర్తితో ఇకపై ప్రతి దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు లక్కీ డ్రాలను నిర్వహిస్తామని వెల్లడించారు. విజేతలను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకూ ప్రతి నెల లక్కీ డ్రా నిర్వహించాలనీ నిర్ణయించామని తెలిపారు.
రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 22.65 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని సజ్జనార్ అన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఒక్క రోజులో ఇంత మొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది రాఖీ పండుగకు ప్రయాణికుల నుంచి వచ్చిన స్పందనకు దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకున్నామని, రాష్ట్రవాప్తంగా మూడు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
గత రెండేళ్లలో టీఎస్ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రయాణికులే కేంద్రంగా అనేక కార్యక్రమాలు తీసుకుని వచ్చామని సజ్జనార్ తెలిపారు. త్వరలోనే మరో 1,000 బస్సులను కొనుగోలు చేయబోతోన్నామని అన్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నాటికల్లా ప్రయాణికుల కోసం కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే ఎనిమిది ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్నామని సజ్జనార్ చెప్పారు. మహిళల కోసం 113 జెడ్/ఎం, 222ఏ, 9 ఎక్స్/272, 9 వై/ఎఫ్ రూట్లల్లో లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. మెరుగైన రవాణా సేవల్ని అందిస్తున్న సంస్థగా టీఎస్ఆర్టీసీ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.