TELANGANA

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు రూ. 10 వేల జరిమానా విధించింది.

ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై పిటిషన్ దాఖలైంది.

2018 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు.

2018 నాటి ఈ కేసులో సునీత ఇప్పటి వరకు కౌంటర్ పిటిషన్ వేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు రూ. 10 వేల జరిమానా విధించింది. అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్ 20కి వాయిదా వేసింది. అక్టోబర్ 18న పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. ఆ తర్వాతే దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. అప్పటి వరకు ప్రస్తుతం అములలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పటి వరకు కవితను విచారణకు పిలవబోమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. కాగా, మహిళలు ఏ స్థాయిలో ఉన్నవారనేది పక్కన పెడితే.. అసలు విచారణకు పిలవద్దంటే ఎలా? అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 20న చేపడతామని వెల్లడించింది.