APTELANGANA

కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును పోలీసులు అడ్డుకున్నారు.

కారుతో సహా సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ద్వారం వద్దే కారును నిలిపివేశారు. ఈ ఘటనతో సీతక్క తీవ్ర అసహనానికి లోనయ్యారు.

తన నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సాయంత్రం సీతక్క.. సచివాలయానికి చేరుకున్నారు. దీనిపై అప్పటికే ఆమె అనుమతులను తీసుకున్నారు. పాస్‌ను చూపించి లోనికి వెళ్లబోతోండగా ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారుతో సహా లోనికి వెళ్లడానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు.

తాను ఎమ్మెల్యేనని, లోనికి వెళ్లడానికి అనుమతులు కూడా ఉన్నాయని సీతక్క వారికి చెప్పారు. కారుతో సహా లోనికి వెళ్లడానికి పర్మిషన్ లేదని, పార్కింగ్ స్థలంలో కారును నిలిపి వెళ్లాలని సూచించారు. దీనితో సీతక్క అసహనానికి గురయ్యారు. వారితో కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. అయినప్పటికీ- వారు అంగీకరించకపోవడంతో నడుచుకుంటూ సచివాలయంలోనికి వెళ్లారు.

దీనిపై సీతక్క విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. సచివాలయం అద్భుతంగా ఉందంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, దీనికి భిన్నంగా ప్రజా ప్రతినిధులను సైతం లోనికి అనుమతించట్లేదని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సచివాలయం లోపలికి ఎందుకు అనుమతించట్లేదంటూ నిలదీశారు.

వైసీపీలో పులివెందుల సతీష్ రెడ్డి: చేరిక తేదీ ఇదే..!!

ఈ అంశంపై తాను రచ్చ చేయాలనుకుంటే చేయగలనని, ప్రజా సమస్యలను వివిధ శాఖల మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి తపై ఇక్కడికి వచ్చానే తప్ప గొడవ పడటానికి కాదని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, చివరికి సెక్రటేరియట్‌లోనూ ప్రవేశం లేదనడం సరికాదని చెప్పారు.