TELANGANA

హైదరాబాద్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు

హైదరాబాద్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరనున్నారు.

ఈ మేరకు ఆయన బుధవారం బండి సంజయ్‌ను కలిశారు. ఆరెపల్లితోపాటు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పార్టీలో చేరతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

కాగా, 2009లో ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మానకొండూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు మోహన్. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్లో కొందరిని మారుస్తారని తెలిసి.. తనకు మానకొండూర్ గానీ, చొప్పదండి టికెట్ గానీ కేటాయిస్తారని ఆశించారు మోహన్. అయితే, అలా జరగలేదు.

ఈసారి కూడా టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు ఆరెపల్లి మోహన్. మానకొండూర్ నుంచి సిట్టింగ్ అభ్యర్థికే టికెట్ కేటాయించడం.. కార్పొరేషన్ పదవి ఇచ్చే విషయంలో కూడా ఏ హామీ లభించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు మోహన్. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ నుంచి మానకొండూర్ టికెట్ వస్తుందని ఆరెపల్లి మోహన్ ఆశిస్తున్నారు. దాదాపు ఆయనకే బీజేపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది.

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురి నేతల చేరికలు ఉండటంతో వారిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.