TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీ లపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి లపై ఈసీ బదిలీ వేటు వేసింది.

వీరు మాత్రమే కాకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంఖ్యలకు ముషారఫ్ అలీతో పాటు మొత్తం 10 జిల్లాల నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది.

సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ చంద్రమోహన్, జోగులాంబగద్వాల జిల్లా ఎస్పీ సృజన. జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్, సూర్యాపేటజిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నర్సింహ, నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్, నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి జిల్లా ఎస్పీ కరుణాకర్ లను బదిలీ చేయాలని ఆదేశించింది.

అంతేకాదు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ తన ఆదేశాలలో పేర్కొంది. రేపు సాయంత్రం 5గంటల వరకు ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరుగుతున్న మిగతా నాలుగు రాష్ట్రాలలో కూడా ఈసీ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 13మంది పోలీస్ అధికారులు, 10మంది నాన్ క్యాడర్ పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు.

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఎన్నికల కమిషన్ పలువురు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ, వారు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని, వారిని మార్చాలని ఎన్నికల సమయంలో వారు నిష్పక్షపాతంగా పనిచేయలేరని ఎన్నికల కమీషన్ కు వినతిపత్రం సమర్పించాయి.

ఎన్నికల వేళ వీరు అక్రమాలకూ పాల్పడే అవకాశం ఉందన్న ఆరోపణల, ఫిర్యాదుల నేపధ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా అధికారులను మార్చే అధికారం ఎన్నికల కమీషన్ కు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు వచ్చిన వారిపై ఎన్నికల కమీషన్ బదిలీ వేటు వేసింది. వీరి స్థానంలో కొత్తవారిని నియమించాలని, అందుకు ప్యానెల్ పంపాలని ఆదేశించింది.