హైదరాబాద్: సింగపూర్ దేశంలోనూ భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచే సింగపూర్ దేశానికి ఎక్కువగా వెళుతుంటారు.
అక్కడే స్థిరపడిన వారి సంఖ్యలో దక్షిణాదివాసులే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో సింగపూర్ దేశానికి హైదరాబాద్ నుంచి విమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది సింగపూర్ ఎయిర్‌లైన్స్.
హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు వారానికి ఏడు నుంచి 12 విమాన సర్వీసులు అదనంగా నడుపుతున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్‌కు విమాన సేవలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. అంతేగాక, ఇందుకు బోయింగ్ 737-8 విమానాలను కూడా వినియోగిస్తామని సింగపూర్ ఎయిర్ లైన్స్ పేర్కొంది.
ఎకానమీలో 144 సీట్లు, బిజినెస్ క్లాసులో 10 సీట్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి సర్వీసులకు ఎయిర్ బస్ విమానాలను ఉపయోగిస్తామని తెలిపింది. వీటిలో 303 సీట్లు ఉంటాయి. బిజినెస్ క్లాస్‌లో 40, ఎకానమీలో 263 సీట్లు ఉంటాయని సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ జీఎం సై యెన్ చెన్ వెల్లడించారు. అక్టోబర్ 29 నుంచి 96 వీక్లీ ఫ్లైట్లను హైదరాబాద్ సమా తొమ్మిది నగరాల నుంచి నడుపుతామని తెలిపారు.
అయితే, స్కూట్ విమానాలు ఇక మీదట హైదరాబాద్ నుంచి ఉండవని, ఇతర నగరాల నుంచి సేవలు అందిస్తాయన్నారు. ప్రస్తుతం వారానికి ఏడు సర్వీసులు నడుస్తుండగా.. అక్టోబర్ 29వ తేదీ నుంచి మరో ఐదు సర్వీసులు పెంచుతామని సింగపూర్ ఎయిర్ లైన్స్ కంపెనీ జీఎం తెలిపారు. సంస్థ అనుబంధ విభాగం స్కూట్ రోజువారీ సర్వీసులను నిలిపివేసిన క్రమంలో ఈ సర్వీసుల పెంపు సానుకూలంగా మారనుంది.