TELANGANA

వంద జన్మలెత్తినా సాధించలేరు: రాహుల్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాహుల్ విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

‘రాహుల్ జీ.. దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ. మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి. దేశ సాగునీటి రంగ చరిత్రలోనే.. అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండి. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి.. బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండి’ అని హితవు పలికారు కేటీఆర్.

‘నీళ్లు పల్లమే కాదు.. బలమైన సంకల్పం ఉంటే… ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోండి. పాతాళంలో ఉన్న గోదావరి నీటిని.. ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి. మొగులు వైపు చూసే దిగులు లేకుండా.. లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి’ అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రాహుల్‌కు చురకలంటించారు.

‘కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ.. బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూడండి… చూసి నేర్చుకోండి…అరవై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో.. అన్నదాతను అరిగోస పెట్టినందుకు.. సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు.. తెలంగాణ రైతుకు బేషరతుగా క్షమాపణలు చెప్పండి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

’80 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో.. లక్ష కోట్ల అవినీతి అని.. అర్థంలేని ఆరోపణలు చేసినందుకు అక్కడే గట్టిగా లెంపలేసుకోండి. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా.. కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి.. సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని

మీరు మరో వంద జన్మలెత్తినా సాధించలేరని ఇప్పటికైనా ఒప్పుకోండి..’ అని రాహుల్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు.