TELANGANA

రాజకీయ దుమారం రేపుతోన్న దుబ్బాక ఘటన.. పార్టీల విమర్శనాస్త్రాలు..

తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థిపై కత్తి పోటు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటన వెనుకు కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నాయని గులాబీ నేతలు ఆరోపిస్తుంటే.. ఆ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. హింసను తాము ప్రేరేపించమని.. దీనిపై వెంటనే విచారణ జరిపాలని డిమాండ్ చేస్తుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

 

తెలంగాణలో ఎలక్షన్‌ హీట్‌ రోజు రోజుకి పెరుగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచార జోరులో ఉన్నారు. ఈ క్రమంలో దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయన కత్తిదాడికి గురయ్యారు. వెంటనే ఆయనను యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఇప్పుడీ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఓ యూట్యూబ్‌ చానల్ రిపోర్టర్‌ రాజు ఈ దాడి చేయగా.. అతడు బీజేపీ, కాంగ్రెస్‌ సానుభూతిపరుడంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై కాంగ్రెస్‌ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ స్పందించారు. కత్తిపోటుకు పాల్పడింది బీజేపీ కార్యకర్తేనని.. బీఆర్‌ఎస్‌ బీజేపీ కుట్రలో భాగమే దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

 

ఇక ఈ ఘటనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. కావాలనే దాడి వెనుక తమ కార్యకర్త ఉన్నాడంటూ చేస్తున్న ప్రచారంలో అవాస్తవమని మండిపడ్డారు. నరసింహులు అనే కార్యకర్తకు కండువా కప్పుతున్న ఫొటోనే సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి.. తానే దాడికి పాల్పడిన రాజు అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికీ ఎవరూ స్పందించకపోవడం పోలీసుల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది తెలుస్తోందని ఆరోపించారు.

 

మరోవైపు కత్తిదాడి ఘటనపై ప్రతిపక్షాలను టార్గెట్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. చేతగాని దద్దమ్మలు ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారని ఆయన ఆరోపించారు. పనిచేయడం చేతగాక, ప్రజల ముందు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక కత్తి దాడులు చేస్తున్నారని కేసీఆర్‌ విమర్శించారు. కత్తి పట్టుకుని పొడవాలంటే తమకు చేతులు లేవా అన్నారు.

 

తమకు తిక్క రేగితే రాష్ట్రంలో దుమ్ముదుమ్ము రేగాలన్నారు. దాడులు ఆపకపోతే తాము అదే పనిచేస్తామని హెచ్చరించారు. అయితే,.. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం పదవిలో ఉండి అలా ఎలా మాట్లాడుతారని సీరియస్‌ అవుతున్నారు. ఓ వ్యక్తి చేసిన దాడిని పార్టీలకు ఎలా ఆపాదిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తికాకుండానే ప్రతిపక్షాలపై నిందలు ఎలా వేస్తారని ధ్వజమెత్తారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడిని కేసీఆర్‌ రాజకీయంగా వాడుకోవాలని అనుకుంటున్నారని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.