తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ బిబీగా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణలో పట్టణాల ఓటర్ల సంఖ్య కంటే గ్రామాల్లో ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన ముసాయిదా జాబితా ప్రకారం.. కొత్తగా గ్రామీణ ఓటర్లు ఎక్కువ మంది నమోదయ్యారు.
దీంతో గ్రామాల్లో ఓటింగ్ చైతన్యం పెరిగిందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీలు కూడా గ్రామీణ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని హామీలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ఓటర్లను ఆకర్షించడానికి దళిత బంధు, రైతు బంధు, 9 గంటల విద్యుత్ వంటి వాటిని ప్రధాన ఎన్నికల అస్త్రాలుగా చేసుకుని ప్రకటిస్తోంది.
బీఆర్ఎస్ తరువాత తెలంగాణలో బలంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామీణ స్థాయిలో దూకుడు పెంచింది. పట్టణాలు, నగరాల్లో బీఆర్ఎస్ చేసిన తప్పులని ఎత్తి చూపిస్తున్న హస్తం నాయకులు..
.. గ్రామాల్లో మాత్రం స్థానిక సమస్యలు.. రైతులు, రైతు కూలీలు సమస్యలుపై కసరత్తు చేస్తోంది. ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టింది. అదేవిధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరు గ్యారెంటీల హామీని కాంగ్రెస్ నాయకులు పూస గుచ్చినట్టు ప్రజలకు వివరిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని గ్రామాలనూ కవర్ చేసేలా పార్టీ అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా మహిళా ఓటుబ్యాంకును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ‘తెలంగాణ ఇచ్చింది మేమే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అంటూ సెంటుమెంటుతో ప్రజలను కదలిస్తున్నారు. అంతేగాక ఇప్పటి వరకు బీఆర్ఎస్ టచ్ చేయని గ్రామాలను కూడా కవర్ చేస్తూ.. గ్రామస్థాయిలో కాంగ్రెస్ నేతలు చెమటోస్తున్నారు.
ఫలితంగా తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రం గ్రామీణ స్థాయిలో వేగంగా మారుతోందనే వాదన వినిపిస్తోంది. పట్టణ ఓటరు ఎన్నికల రోజున పరిస్థితిని బట్టి పోలింగ్‌బూత్‌కు వస్తాడు. కానీ, గ్రామాల్లో అయితే.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్.. గత ఎన్నికల లెక్కలను కూడా పరిశీలనలోకి తీసుకుని గ్రామాలపై పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
కానీ ఎన్నికలకు ఈ నెలపాటు సమయం ఉండడంతో రాజకీయ సమీకరణాలు ఏ రోజు ఎలా మారుతాయో చెప్పలేని పరిస్థితి. అయితే కాంగ్రెస్ ఇదే స్పీడుతో కొనసాగితే గ్రామీణ ఓటర్లని తన ఖాతాలో వేసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.