తెలంగాణలో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 3,500కుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అసలు సిసలు పోరాట ఘట్టం మొదలవబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. మరోవైపు చివరి రోజు అభ్యర్థుల మార్పుతో బీజేపీ అసంతృప్తి పెరిగింది.
తెలంగాణలో నామినేషన్ల గడువు ముగియడంతో తదుపరి ప్రచారాలపై పొలిటికల్ పార్టీలు ఫోకస్ పెంచుతున్నాయి. చాలా చోట్ల అఫిడవిట్లు, నామినేషన్ పేపర్లు నింపడంలో ముఖ్య పార్టీల నేతలతోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తడబడ్డారని చెబుతున్నారు. రిటర్నింగ్ అధికారుల నోటీసులే ఇందుకు నిదర్శనమంటున్నారు.
మరోవైపు కామారెడ్డిలో హైవోల్టేజ్ పోరాటానికి రంగం సిద్ధమైంది. తొలుత కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయగా.. చివరిరోజు రేవంత్ రెడ్డి.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి నామినేషన్ వేశారు. ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు రేవంత్ కామారెడ్డిలో సై అంటే సై అంటున్నారు. రేవంత్ నామినేషన్ దరావతు 11 వేలను కేసీఆర్ అమ్మమ్మ గ్రామం కోనాపూర్ వాసులు విరాళంగా అందజేయడం కీలకంగా మారింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ వరుసగా డిక్లరేషన్లు రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే మైనార్టీ డిక్లరేషన్ రిలీజ్ చేయగా.. తాజాగా బీసీ డిక్లరేషన్ ను కామారెడ్డిలో విడుదల చేసింది. ఇందులో బీసీల అభివృద్ధి కోసం కీలక అంశాలను హస్తం ప్రస్తావించింది. ముదిరాజ్ వర్గం చిరకాల కోరిక అయిన బీసీ ఏలో చేరికపై కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ డిక్లరేషన్లు ఓటర్లలో ఎంత వరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
అటు నామినేషన్ల చివరి రోజు అభ్యర్థుల మార్పు నిరసనలకు దారితీసింది. బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం చర్చనీయాంశంగా మారింది. వేములవాడ టిక్కెట్ చాలా ఉత్కంఠ కలిగించింది. మొదట తుల ఉమకు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆమె బీ ఫాం లేకుండానే నామినేషన్ వేశారు. చివరి క్షణంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు బీజేపీ బీఫాం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈటల అనుచరురాలిగా పేరున్న తుల ఉమకు టిక్కెట్ దక్కకపోవడం, బండి వర్గానికి చెందిన వికాస్ రావు బీఫామ్ ఇవ్వడంతో హైడ్రామా నెలకొంది. బీజేపీలో బీసీలను ఎదగనివ్వరని, మహిళా రిజర్వేషన్ పేరు చెబుతూ తనకు టిక్కెట్ ఇవ్వకుండా ఆపడం కుట్రే అంటూ ఫైర్ అయ్యారు తుల ఉమ.
అటు పఠాన్ చెరులో కాంగ్రెస్ తొలుత నీలం మధుకు టిక్కెట్ ఇచ్చింది. అయితే చివరిరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ కు బీఫాం ఇచ్చింది. దీంతో నీలం మధు బీఎస్పీ నుంచి నామినేషన్ వేశారు. అటు నారాయణఖేడ్ లో సంజీవరెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్ టిక్కెట్ దక్కించుకున్నారు. మొత్తంగా నామినేషన్ల చివరి రోజు చాలా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టిక్కెట్ రాని నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారు.