TELANGANA

మాదిగ విరోధులు కాంగ్రెస్, బీఆర్ఎస్.. త్వరలో ఎస్సీ వర్గీకరణ కమిటీ : ప్రధాని మోదీ..

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ ఉపకులాలను విరోధులగా చూస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో శనివారం జరిగిన మాదిగల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రకటించారు.

 

మాదిగల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాలు బహిరంగ సభ నిర్వహించాయి.

 

ఈ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ… బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మాదిగలను విరోధులుగా చూస్తు్న్నాయన్నారు. ఎంతో ప్రేమతో మందకృష్ణ తమ్ముడు ఈ సభకు తనను ఆహ్వానించారన్నారు. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. మాదిగల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

 

“ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. ఇంత ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు.అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు. ఆ ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికి తేడా గమనించాలి. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. అనేది మా విధానం. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. పేదరిక నిర్మూలనే మా ప్రథమ ప్రాధాన్యం. న్యాయం చేస్తామని అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి. మీరంతా వన్ లైఫ్‌. వన్‌ మిషన్‌లా పోరాటం చేస్తున్నారు. మీ బాధలు పంచుకునేందుకే నేను ఇక్కడకు వచ్చాను” అని చెప్పారు.

 

“మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తాం. మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తా. ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం. మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాం. మీ హక్కుల సాధనలో మా తరపున సంపూర్ణ మద్దతు ఇస్తాం. వర్గీకరణకు చట్టపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాం”. ” అని మోదీ అన్నారు.

 

మందకృష్ణ నిజమైన యోధుడు

మాదిగలకు అన్యాయం జరిగిందని మేం భావిస్తున్నాం. 30 ఏళ్ల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడు. అహింసా మార్గంలో ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ నమస్సులు. మాదిగల ఉద్యమాన్ని గుర్తించాం.. గౌరవిస్తాం. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా.

 

బీఆర్ఎస్ హయాంలో మాదిగలకు అన్యాయం

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోంది. దళిత నేతను సీఎం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ సీఎం కుర్చీలో కూర్చున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. ప్రస్తుతం తెలంగాణ సంకట స్థితిలో ఉంది. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయింది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. దళితబంధు అన్నారు.. ఇవ్వలేదు. దళిత బంధు పథకం వల్ల బీఆర్ఎస్ నేతలకే మేలు జరిగింది. దళితుల ఆశలపై నీళ్లు చల్లింది కేసీఆరే.