TELANGANA

రికార్డు స్థాయిలో 4795 నామినేషన్లు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే అసలైన వార్…

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు సిసలు ప్రచార హోరు మొదలవనుంది. ఈ దీపావళి ఏ పార్టీల్లో వెలుగులు నింపుతుంది.. ఏ పార్టీకి చీకట్లు నింపుతుందన్నది ఉత్కంఠగా మారింది. పైకి ముక్కోణపు పోరు అంటున్నా.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అసలైన ఎన్నికల యుద్ధం కనిపిస్తోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండడంతో టైం చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి.

 

ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గ్రౌండ్ లో దిగేశారు. ఇప్పటికే ఊరూవాడా ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. ప్రచారాలు క్లైమాక్స్ కు చేరుతుండడంతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలను టార్గెట్ చేసేలా పెద్ద ఎత్తున అసంతృప్తులు పోటీకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రికార్డు స్థాయిలో 4795 నామినేషన్లు దాఖలయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,399 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపైంది. టిక్కెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పార్టీలు లెక్కలేసుకున్నాయి. బీజేపీ అయితే ఏకంగా బీసీలకే పెద్ద పీట వేసింది. గెలిపిస్తే బీసీనే సీఎం చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ బీసీలకు 23 టిక్కెట్లు ఇస్తే అగ్రవర్ణాలకు 58 టిక్కెట్లు ఇచ్చారు. అటు బీఆర్ఎస్ బీసీలకు 24 టిక్కెట్లు ఇవ్వగా.. 60 మంది ఓసీలకు టిక్కెట్లు ఇచ్చింది. ఇక బీసీలకు అత్యధికంగా బీజేపీ, బీఎస్పీ టిక్కెట్లు కేటాయించాయి.

 

తమ ఆకాంక్షలు నెరవేరలేదని ఎవరైనా భావిస్తే తమకు న్యాయం జరగలేదని ఎవరైనా అనుకుంటే.. తమ సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహంగా ఉండే వారంతా ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. ముఖ్యంగా ఈసారి సాధారణ జనాలకు టార్గెట్ కేసీఆర్ అయ్యారు. సీఎం కేసీఆర్ నిలబడ్డ గజ్వేల్, కామారెడ్డిలో ఈసారి భారీగా పోటీ నెలకొంది. గజ్వేల్‌లో 110 నామినేషన్ల దాఖలయ్యాయి. వీరిలో కేసీఆర్ పై కోపంతో నామినేషన్‌ వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇందులో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలిచారు. కేసీఆర్ ఓటమే తన లక్ష్యమంటున్నారు. తనను బీఆర్ఎస్ నుంచి అవమానకర రీతిలో బయటకు పంపించారని, తనను హేళన చేసిన కేసీఆర్ ను ఓడిస్తానని సవాల్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి బరిలో ఉన్నారు.

 

వీరు కాకుండా… ఓయూ జేఏసీ నిరుద్యోగ రాష్ట్ర అధ్యక్షుడు కుంభంపాటి సత్యనారాయణ, అమరవీరుల కుటుంబ సభ్యుల రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి కూడా పోటీకి సై అంటున్నారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయలేదన్న ఆగ్రహంతో బుట్టంగారి మాధవరెడ్డి.. కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. ధరణి పోర్టల్ లో సమస్య పరిష్కారం కాకపోవటంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేంద్రనగర్‌ కు చెందిన శంకర్‌ హిల్స్‌ సభ్యులు 45 మంది ఏకంగా నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్‌లో చేయలేని అభివృద్ధి కామారెడ్డిలో చేస్తామంటే నమ్మబోమంటూ.. మరో ఐదుగురు పోటీలో ఉన్నారు. BRSలో సామాజిక న్యాయం జరగలేదనే కోపంతో వివిధ కుల, మత సంఘాల నేతలు కూడా గులాబీబాస్‌పై సై అంటున్నారు. ఇది కేసీఆర్ కు కొత్త సవాల్ గా మారింది. గత రెండు దఫాల్లో ఇలా ఇంత మంది కేసీఆర్ పై నామినేషన్లు వేయలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితపై అప్పుడు రైతులు పెద్ద సంఖ్యలో పోటీ చేశారు. దీంతో ఆమె ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఉంది.

 

ఇక కామారెడ్డి పోటీలో మొత్తం 30 మంది ఉన్నారు. వీరిలో నిరుద్యోగులు, పౌల్ట్రీ రంగానికి చెందిన వారూ ఉన్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోవటంతో నిరసన తెలిపేందుకు కొందరు బరిలోకి దిగారు. వీరిలో చాలా మంది స్వతంత్రులు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది పోటీకి సై అన్నా.. మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి కొందరిని బుజ్జగించారంటున్నారు. వారిలో మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు, లబాన్ లంబాడీలు ఉన్నారు. వీరితో పాటు నిరుద్యోగులు, దళితబంధు పథకం రానివారు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తారని ఎదురుచూసి.. భంగపడి వారూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి… 21, 22 ప్యాకేజీను రీ డీజైన్‌ చేయగా… భూములు కోల్పోయిన రైతులు కూడా పోటీలు ఉండాలనుకున్నా చివరకి వెనక్కు తగ్గారు.

 

నామినేషన్ల చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్ లో నాటకీయ పరిణామాలు కొనసాగాయి. లాస్ట్ మినట్ వరకు టిక్కెట్ల పంచాయితీ నడిచింది. ఎవరికి బీఫామ్ దక్కుతుందనే ఉత్కంఠ చివరి నిమిషం దాకా కొనసాగింది.బీజేపీ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చగా, కాంగ్రెస్ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. రెండు పార్టీలు చివరి నిమిషంలో వేరే వాళ్లకు బీఫామ్లు ఇచ్చాయి. చివరి నిమిషంలో ఇద్దరు అభ్యర్థులను బీజేపీ మార్చింది. వేములవాడ, సంగారెడ్డి స్థానాల్లో మార్పులు చేసింది. మొదట వేములవాడ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. బీఫామ్ మాత్రం మాజీ గవర్నర్‌‌ చెన్నమనేని విద్యాసాగర్‌‌రావు కుమారుడు వికాస్‌‌ రావుకు ఇచ్చింది. ఇక సంగారెడ్డి అభ్యర్థిగా మొదట రాజేశ్వరరావు దేశ్ పాండేను ప్రకటించింది. కానీ చివరికి పులిమామిడి రాజుకు బీ-ఫామ్ ఇచ్చింది.

 

కాంగ్రెస్ కూడా రెండుచోట్ల అభ్యర్థులను మార్చింది. మొదట పటాన్ చెరు టికెట్ నీలం మధుకు ప్రకటించింది. అయితే మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా వ్యతిరేకించడంతో నీలం మధును మార్చింది. కాటా శ్రీనివాస్ గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక నారాయణఖేడ్‌‌ నుంచి మొదట సురేశ్‌‌ షెట్కార్‌‌కు టికెట్‌‌ ప్రకటించి, ఆయన స్థానంలో పట్లోళ్ల సంజీవరెడ్డికి చాన్స్ ఇచ్చింది. దీనిపై సురేశ్ షెట్కార్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అగ్ర నేతలు రంగంలోకి దిగి బుజ్జగించారు. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని మార్చింది. మొదట అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్.. ఆయన స్థానంలో విజేయుడికి బీఫామ్ ఇచ్చారు. చివరి నిమిషంలో బీ ఫాం దక్కని నేతలంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని అబ్రహం ప్రకటించారు. అటు టిక్కెట్ దక్కని సూర్యాపేట కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు బీజేపీ బీ ఫాం దక్కని తుల ఉమ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిశారు. తమతో కలిసి రావాలని ఆహ్వానించారు.

 

మరోవైపు టిక్కెట్లు రాని 15 మంది కాంగ్రెస్ ఆశావహులతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. భవిష్యత్ లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పలువురికి ఎంపీ టిక్కెట్లపై హామీ ఇచ్చారు. సురేష్ షెట్కార్ కు జహీరాబాద్ ఎంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పి బుజ్జిగించినట్లు తెలిసింది. ఎన్నో ట్విస్టులు, ఎంతో కసరత్తు తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు సీపీఐకి ఇచ్చారు. మొత్తం 4 జాబితాలుగా లిస్టులను రిలీజ్ చేసింది హస్తం పార్టీ. మొత్తంగా గెలుపు గుర్రాలతో కదన రంగానికి అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. టఫ్ ఫైట్ లో అంతిమ విజేత ఎవరన్నది ఉత్కంఠగా మారింది. దీపావళి తర్వాత ప్రచార డోసు మరింత పెరుగుతుందంటున్నారు.