TELANGANA

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్..

కెసిఆర్ రెండుచోట్ల గెలుస్తారా? లేకుంటే ఓడిపోతారా? ఆయనకు లభించే మెజారిటీ ఎంత? అన్నదానిపై ఎక్కువగా బ్యాటింగ్ జరుగుతోంది. అటు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో మెజారిటీ పై సైతం పెద్ద ఎత్తున నగదు జమ చేసి మరి బెట్టింగ్ కొడుతున్నారు. గ్రేటర్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జనసేన ఎన్ని స్థానాల్లో గెలుపు పొందుతుంది? అన్న అంశాలపై సైతం బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ బెట్టింగ్ పర్వం బలంగా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? లేకుంటే కేటీఆర్ కు పట్టం కడతారా? కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గు చూపుతోందా? లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారా? లేకుంటే భట్టి విక్రమార్కను సీఎం కుర్చి పై కూర్చోబెడతారా? వీటి పైన బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక ముఠాలు సైతం రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో ఇదే మాదిరిగా బెట్టింగ్ సాగింది. అప్పట్లో కాంగ్రెస్, టిడిపి కూటమిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ కట్టిన వారికి షాక్ తగిలింది. అందుకే ఈసారి అక్కడ పరిస్థితిని తెలుసుకొని బెట్టింగ్ కడుతున్నారు. లక్షకు పది లక్షలు.. 50 లక్షలకు కోటి రూపాయలు చొప్పున బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను సోషల్ మీడియాను వేదిక చేసుకున్నట్టు సమాచారం. అయితే ఎలక్షన్ బెట్టింగ్ పై పోలీసులు సైతం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.