మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి . ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఒక ఆసక్తికరమైన గిఫ్ట్ ను పంపుతున్నానని ప్రకటించారు. కెసిఆర్ ఇక ఇంటికి వెళ్ళే సమయం వచ్చిందంటూ ప్యాకప్ చేసుకునేందుకు బై బై కేసీఆర్ అని రాసి ఉన్న ఒక ట్రాలీ బాక్స్ ను పంపుతున్నట్టుగా ఆమె వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు బై బై కేసీఆర్ అంటున్నారని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. నేడు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల కెసిఆర్ ని ఓడించేందుకు తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. రేపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని పేర్కొన్న షర్మిల కెసిఆర్ రాక్షస పాలనకు రేపటితో ముగింపు లభిస్తుందన్నారు.
తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ చూసామని, ఆ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కావాలని కోరుకుంటున్నామని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని షర్మిల వెల్లడించారు. ఇంతకాలం బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయని పేర్కొన్న షర్మిల కెసిఆర్ అవినీతిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
కెసిఆర్ ఏ స్కీమ్ చేసినా స్కామే అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ ఏటీఎం గా వాడుకున్నాడని జలవనరుల శాఖ మంత్రి ఆరోపించారన్నారు. రేపటి తీర్పును సీఎం కేసీఆర్ తన పాలన తీర్పుగా భావించి గౌరవించాలని వైయస్ షర్మిల హితవు పలికారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొని మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నించవద్దని కెసిఆర్ ను షర్మిల డిమాండ్ చేశారు. 2014, 2018లో కెసిఆర్ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివరాలను ఆమె గణాంకాలతో సహా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి అనుభవం ఉన్న నేతలు ఉన్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.