TELANGANA

ఆరు గ్యారంటీల ఫైలుపై రేవంత్ తొలి సంతకం-రజనీకి ఉద్యోగమిస్తూ రెండో సంతకం..

ఇవాళ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన రెండు కీలక ఫైళ్లపై సంతకాలు చేసారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన రెండు హామీలపై ఆయన ఈ సంతకాలు చేశారు. దీంతో ప్రమాణస్వీకార వేదిక అయిన ఎల్బీ స్డేడియంలో హర్ష్వధ్వానాలు మిన్నంటాయి.

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే .. రెండు అంశాలపై సంతకాలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడిగా హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం మరగుజ్జు యువతి రజనీకి ఉద్యోగం కల్పిస్తానని కూడా గతంలో రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో రెండో సంతకం రజనీకి ఉద్యోగమిచ్చే ఆదేశాల ఫైలుపై సంతకం చేశారు.

 

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు తెలంగాణ ఎన్నికల్లో బాగా పనిచేశాయి. ఓటర్లను కాంగ్రెస్ వైపు పూర్తిగా మొగ్గేలా చేశాయి. కాంగ్రెస్ ఈ ఆరు గ్యారంటీలు ఇవ్వగానే అప్పటి అధికార బీఆర్ఎస్ కూడా తమ మ్యానిఫెస్టోలో ఇంతకు మించిన హామీలు ఇచ్చింది. అయినా ప్రజలు వాటిని నమ్మలేదు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డి అమలు చేయగలిగే హామీలే మ్యానిఫెస్టోలో ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆరు గ్యారంటీలతో పాటు పలు అంశాలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చోటు కల్పించారు.