తెలంగాణ సీఎం రేవంత్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రేవంత్ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ఆరోగ్యం పై ఆరా తీసారు. కొద్ది సేపు కేసీఆర్ తో ముచ్చటించారు. కేసీఆర్ కు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను ఆరా తీసారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆకాంక్షించారు.
ఆస్పత్రికి సీఎం రేవంత్ : సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు. పాలనా పరంగా నాలుగు రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజా దర్బార్ ప్రారంభించారు. రాజకీయంగా విభేదించినా..ముఖ్యమంత్రిగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై స్పందించారు. కేసీఆర్ ఫాం హౌస్ లో జారి పడి తుంట ఎముక విరిగింది. దీంతో, హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రి లో కేసీఆర్ కు శస్త్ర చికిత్స చేసారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. కేసీఆర్ ఆస్పత్రిలో చేరిన వెంటనే సీఎం రేవంత్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. ఆస్పత్రికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని పంపారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఇక, ఇప్పుడు నేరుగా కేసీఆర్ ను ఆస్పత్రిలో పరామర్శించారు.
కేసీఆర్ కు పరామర్శ : కేసీఆర్ ను పరామర్శించారు. అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్ కు సూచించారు. ఆస్పత్రికి చేరుకున్న రేవంత్ అక్కడే ఉన్న కేటీఆర్ తో సమావేశమయ్యారు. చికిత్స తీరు గురించి చర్చించారు. కేసీఆర్ ను పరామర్శించటానికి రావటం పైన రేవంత్ కు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు.
హిప్ రీప్లేస్ మెంట్ జరిగిందని..మరో మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని కేటీఆర్ వివరించారు. రెండు నెలలు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ త్వరగా కోలుకొని శాసనసభా సమావేశాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు రేవంత్ చెప్పారు. వైద్యులతోనే చర్చించానని వెల్లడించారు.
ఆస్పత్రికి మంత్రులు : సీఎంతో పాటుగా సీతక్క, షబ్బీర్ అలీ ఆస్పత్రికి వచ్చారు. అంతకు ముందు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ సైతం ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించారు. పొన్నం ప్రభాకర్ ఆస్పత్రిలో కేటీఆర్, హరీష్ తో కేసీఆర్ ఆరోగ్యం పై ఆరా తీసారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యలతోనూ సీఎం..మంత్రులు చర్చించారు.
కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని వివరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న వైద్యులు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. డిశ్చార్జ్ అయినా కేసీఆర్ పూర్తి స్థాయిలో కోలుకోవటానికి రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కేసీఆర్ ను సీఎంతో పాటుగా మంత్రులు పరామర్శించటం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.