తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో నూ పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి కోలుకొనే విధంగా కార్యాచరణ ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్లు..సీట్లతో బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా సీట్ల ఖరారులో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
బీజేపీ కొత్త లెక్కలు : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పైన ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కొత్త వ్యూహాలతో టార్గెట్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలు స్థానిక పరిస్థితుల ఆధారంగా కాకుండా దేశరాజకీయ అంశాల ప్రభావం మేరకు జరిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో మోడీకి ఉన్న ఆదరణ తో తెలంగాణలో గతం కంటే సీట్లు పెంచుకోవాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో నాలుగు సీట్లు వచ్చాయి. ఈ సారి సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే బీజేపీ పునాదులు సిద్దం చేసుకుంది. బీసీ సీఎం నినాదంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ నిర్ణయం కలిసి వస్తుందని బీజేపీ అంచనాగా కనిపిస్తోంది. దీంతో..వచ్చే ఎన్నికల్లో సీట్ల ఖరారులో అనూహ్య ఎంపికలకు రంగం సిద్దమైంది.
వేళ ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసారు. కమిటీ ఏర్పాటు చేసారు. ఆ సమయంలో మందకృష్ణమాదిగ నాయత్వాన్ని ప్రశంసించారు. లోక్ సభ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ అభ్యర్దిగా మందకృష్ణమాదిగ ను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. పెద్దపల్లి నుంచి మందకృష్ణమాదిగ ను బరిలోకి దింపటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఇదే స్థానానికి కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్, లేదా మాజీ ఎంపీ వివేక్ కూమరుడు వంశీకృష్ణ, అద్దంకి దయాకర్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. బీఎస్పీ నుంచి రాష్ట్ర చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ లేదా పెద్దపల్లిలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి పోటీకి సమాయత్తమవుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకే మరోసారి టికెట్ దక్కే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ పూర్తిగా బీసీ – ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల కేటాయింపులో నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఎస్సీ- బీసీ కాంబినేషన్ తో : తెలంగాణలో లోక్ సభ సీట్లలో రెండు మాదిక సామాజిక వర్గం…ఒకటి మాల సామాజికవర్గానికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను బరిలోకి దింపేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పదవీ విరమణ చేయగా..మరకొరు కర్ణాటకలో పదవీ విరమణ చేసారు. ఈ ఇద్దరికీ తెలంగాణలో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ల్లో బాపూరావు మినహా మిగిలిన ముగ్గురికి సీట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ సైతం ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం వేళ తెలంగాణలో లోక్ సభ సీట్ల కేటాయింపు ఆసక్తి కరంగా మారుతోంది.