TELANGANA

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర!!

2024 సంవత్సరంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో నేటి నుండి యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్‌గ‌ఢ్, మిజోరాం రాష్ట్రాల్లో వికసిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర‌ను ప్ర‌ధాన మంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు.

 

తెలంగాణ రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కామారెడ్డి నుండి ప్రారంభించనున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తాజా సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి డబుల్ జైంట్ కిల్లర్ గా నిలిచిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కామారెడ్డి నుంచి ప్రారంభించాలని బిజెపి నిర్ణయించింది.

 

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 రోజులపాటు 163 వాహనాలు నిత్యం తిరిగేలా ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13వేల సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడం, వివిధ పథకాలకు కొత్త లబ్ధిదారులను ఎన్ రోల్ చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుంది.

 

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేశారు. పార్లమెంటు ప్రవాస యోజన లో ఉన్న కేంద్ర మంత్రులు ఈ యాత్రలో మూడు రోజులైనా పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు. మహబూబ్ నగర్’లో జరిగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే పాల్గొంటారు.

 

ఇక నేడు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గంగదేవిపల్లి లో ప్రారంభం కానుంది. మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి సక్సెస్ అవుతుందా లేదా అనేది వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తేలనుంది.