తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఆరో రోజైన గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్లు సభ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికి భయపడేది లేదని.. కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఎంత సేపు మాట్లాడినా అభ్యంతరం లేదన్నారు. చర్చ పక్కదోవ పట్టకుండా చూడాలన్నారు. అంతేగాక, విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో గజ్వేల్, హైదరాబాద్ సౌత్ పాతబస్తీ ఉన్నాయని రేవంత్ చెప్పారు. విద్యుత్ శాఖపై శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు.
సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లు తెలంగాణను పాలించారు. బీఆర్ఎస్, ఎంఐఎం వేరు కాదు.. ఇద్దరూ కలిసే పాలించారు. విద్యుత్ కోతలపై ధర్నాలు చేశారా? అని జగదీశ్ రెడ్డి అడిగారు. కామారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ధర్నాల వార్తల క్లిప్పింగులు ఇవిగో.. పరిశీలించుకోండి అంటూ పేపర్ క్లిప్స్ చూపించారు సీఎం రేవంత్.
కొత్త ఎమ్మెల్యే అంటూ అధికార పక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేను అక్బరుద్దీన్ వ్యాఖ్యానించడంపై రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలన్నారు. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నకైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశామన్నారు రేవంత్. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం అధినేత మాత్రమే.. ఆయనను తాము ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదన్నారు సీఎం రేవంత్. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారు. మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేదు. తాము అజారుద్దీన్ కు టికెట్ ఇస్తే అక్బరుద్దీన్ ఓడించే ప్రయత్నం చేశారు. షబ్బీర్ అలీని ఎంఐఎం ఓడించాలని చూసింది. బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? అని ప్రశ్నించారు సీఎం రేవంత్.
బీఆర్ఎస్ ప్రొగ్రెస్ రిపోర్టు మాత్రమే చదువుతున్న అక్బరుద్దీన్‌కు లోపాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ ఉంటే వినేందుకు తాము సిద్ధంగా లేమన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజలు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చొబెట్టారన్నారు. బీఆర్ఎస్ తరపున ఎంఐఎం వకాల్తా పుచ్చుకుంటోందని ప్రశ్నించారు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.
గత ప్రభుత్వంలో ఎంఐఎం కూడా ఉంది.. ఆ ప్రభుత్వంలో తప్పులకు ఎంఐఎం బాధ్యత కూడా ఉంటుందన్నారు. ఈ క్రమంలో మజ్లిస్, బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో గందరగోళం మధ్యనే సీఎం ప్రసంగాన్ని కొనసాగించారు. ఎంఐఎం కథ చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉందన్నారు. ఎంఐఎం సీనియర్ నేత పరిపక్వంగా మాట్లాడాలంటూ అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
సీఎం వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ స్పందిస్తూ.. రేవంత్ విద్యుత్ బిల్లుల బకాయిలపై మాట్లాడుతున్నారా? విద్యుత్ శాఖ అప్పులపై మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. దీనికి రేవంత్ సమాధానమిస్తూ.. సిద్దిపేటలో హరీశ్ రావు, గజ్వేల్‌లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్‌లో అక్బరుద్దీన్ బాధ్యత తీసుకుని విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తే.. విద్యుత్ శాఖ అప్పుల ఊబిలో నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు.
మరోవైపు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడేలా సూచనలిస్తారని శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. సీనియర్ సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సభలో ఎలా ఉండాలో కొత్త వాళ్లకు సీనియర్ సభ్యులు చెప్పాలన్నారు. సభా నాయకుడి గురించి అక్బరుద్దీన్ అఖల్ ఉందా? అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. సీనియర్ సభ్యులు హుందాగా మసులుకోవాలంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి.