TELANGANA

రుణమాఫీపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తున్నారు. తాజాగా రేషన్‌ కార్డుల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మరో కీలక హామీ అమలుపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వస్తూ రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి రేవంత్‌ ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది. రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్ర అర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని అమలు మార్గాలపైన కసరత్తు మొదలు పెట్టారు.

 

More

From Telangana politics

39 లక్షల మంది.. రూ.40 వేల కోట్ల రుణాలు

కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో భాగంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి సుమారు 39 లక్షల మంది రైతులు.. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణ గ్రహీతలుగా ఉన్నారు. వీరు పంట పెట్టుబడి కోసం తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు రూ.40 వేల కోట్లు ఉన్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు.

 

లెక్కల్లో అధికారులు..

రుణ మాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్‌ చేస్తే దాదాపు 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రూ.2 లక్షలలోపు అప్పు ఉంటే.. మొత్తం మాఫీ అవుతుంది. అంతకంటే ఎంత ఎక్కువ ఉన్నా రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తారు. దీని ద్వారా రూ.32 వేల కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిధులను ఎలా సమీకరించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

 

ప్రభుత్వం పేరిట బదలాయింపు..

బ్యాంకర్లతో మాట్లాడి.. ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతోంది. దీని ద్వారా ముందుగా రైతుల పేరుమీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదికి బదలాయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాంగ్‌ టర్మ్‌ పెట్టుకొని.. వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పలా మారిన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు.

 

నిధుల సమీకరణ..

రైతుల అప్పులు అప్పులు బదలాయించుకొని వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు చెల్లించడమే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు బ్యాంకులు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు సిద్ధమైతే బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. 2023–24 బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయించిన నిధులను కూడా వినియోగించుకోవచ్చు. రైతులు తీసుకున్న అప్పులపై అధికారులు లెక్కలు తీస్తుండడంతో.. ఎప్పటివరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారన్న చర్చ మొదలైంది. రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన తేదీని కటాఫ్‌ తేదీగా నిర్ణయిస్తారా..లేక కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తేదీ డిసెంబర్, 7ని కటాప్‌ గా తీసుకోవాలా అనేది నిర్ణయించాల్సి ఉంది.