తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న పోన్ ట్యాపింగ్ కేసుపై కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. కాంగ్రెస్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తుందని.. ఒక వేళ చేస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండవచ్చని కేటీఆర్ అన్నారు. దాని గురించి తనకేం తెలుసని ప్రశ్నించారు. దొంగల ఫోన్లు ట్యాప్ చేయండం పోలీసుల పని అని పేర్కొన్నారు. కేటీఆర్ మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్నారు. హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాలం గడువుతుందని కేటీఆర్ విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలించడం తెలియదన్నారు. హీరో నాగార్జున గ్రీకువీరుడు అయితే రేవంత్ రెడ్డి లీకువీరుడని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తెచ్చారని చెప్పారు. రూ.2 లక్షల రుణ మాఫీ అయితేనే కాంగ్రెస్ ఓటు వేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన రావు డీజీపీని కలిశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తానే మొదటి బాధితుడినని చెప్పారు. కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయలేరని అన్నారు.
దుబ్బాక ఎన్నికల్లో తన ఫోన్, తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన డిఎస్పీ చెప్పారని రఘునందన్ రావు గుర్తు చేశారు.
అప్పుడే నేను డీజీపికి ఫిర్యాదు చేశానని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి మెదక్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని కోరారు. గతంలో బేగంపేట్ కోటి రూపాయలు పట్టుబడ్డ కేసులో ప్రస్తుత ఎమ్మెల్యేలు రాజ్ గోపాల్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామిలు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులేనని చెప్పారు. ఆకేసు కూడా ముందుకు పోలేదన్నారు. వారు కూడా ఫిర్యాదు చేయాలని విజ్ణప్తి చేస్తున్నట్లు తెలిపారు.
కోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా విన్నారని చంద్రబాబు కూడా చెప్పారని రఘునందన్ రావు గుర్తు చేశారు. సీజేఐకి ఫిర్యాదు చేయాలని న్యాయమూర్తులను కోరుతున్నానని పేర్కొన్నారు. కర్ణాటక, ఆంధ్రలోని రాజకీయ నాయకులను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి రెండు రూ. కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. 13 కోట్లు విలువైన బాండ్స్ ను కొనిపించారని అన్నారు.