TELANGANA

రేవంత్‌కు ‘రేషన్‌’ టెన్షన్‌..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పాలనలో తన మార్కు చూపించేందుకు కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే.. గ్యారంటీలను అమలు చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది. ఈ క్రమంలో పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న అర్హులకు కొత్త కార్డుల జారీపై దృష్టిపెట్టింది. అయితే, ముందుగా ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డులు రద్దు చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. వాటిస్థానంలో డిసెంబర్‌ 28 నుంచి కొత్తవి జారీ చేయాలని భావిస్తోంది. ఈమేరకు విధివిధానాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

 

More

From Telangana politics

ఆ నిర్ణయంతో కొత్త తలనొప్పి..

అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేషన్‌ కార్డులు రద్దు చేస్తే కొత్త సర్కార్‌కు తలనొప్పి తప్పదని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.80 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులను రద్దుచేసి కొత్తవి జారీ చేయడం ఇబ్బందికరమైన ప్రక్రియ అని నిపుణులు అంటున్నారు. రద్దు చేసిన కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయకపోయినా, జారీలో ఆలస్యమైనా మొదటికే మోసం వస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు ఆరు గ్యారంటీలకు రేషన్‌ కార్డును తప్పనిసరి చేయడంతో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రేషన్‌ కార్డుల జారీకి రేవంత్‌ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. అయితే పాత కార్డులను ఏం చేయాలో తేల్చుకోలేకపోతోంది.

 

కొత్తవి ఇవ్వకపోయినా..

ఇక ఆరు గ్యారంటీల అమలుకు రేషన్‌ కార్డు కంపల్‌సరి చేసిన నేపథ్యంలో కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారంతా వీటికి అర్హత పొందలేరు. కార్డులు ఇవ్వకుండా పథకాలను అమలు చేస్తే రేవంత్‌ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశం విపక్ష బీఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రక్షాళన ద్వారా రేషన్‌ కార్డుల సంఖ్య తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న కార్డులకు తోడు, కొత్తవి జారీ చేస్తే ప్రభుత్వంపై భారం పడుతుందని సర్కార్‌ లెక్కలు వేస్తోంది. అయితే ఈ క్రమంలో పాత కార్డులు పోయినా.. కొత్త కార్డు జారీ కాకపోయినా, అర్హులకు అన్యాయం జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం ఖాయం.

 

ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి ఏం చేస్తారు? సీఎం నిర్ణయం ఎలా ఉంటుంది.. దాని పర్యవసానం ప్రభుత్వంపై ఎలా ఉంటుంది అన్న చర్చ ఇటు కాంగ్రెస్‌లో, అటు ప్రజల్లో జరుగుతోంది.