తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇస్పటికే రెండు హామీల అమలు మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే(డిసెంబర్ 9 నుంచి) ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. మిగతా హామీలను కూడా అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిధుల సమీకరణకు కసరత్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యాంరటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
More
From Telangana politics
దరఖాస్తు ఫాం ఇదే..
ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన దరఖాస్తు ఫాంను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరు హామీలకు వేర్వేరుగా కాకుండా ఒకే దరఖాస్తుతో ఆరు పథకాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. ఈ దరఖాస్తు ఫాంలో మొదట పేరు, చిరునామాతోపాటు ఆధార్ కార్డు నంబర్ రాయాల్సి ఉంటుంది. మిగతా పేజీల్లో మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సబంధించిన వివరాలు పేర్కొనాలి. ఇక ఆరు గ్యారంటీల్లో యువ వికాసం మినహా ఐదు గ్యారంటీలకు ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
తెల్ల రేషన్‌కార్డు ప్రామాణికం..
ప్రస్తుతం అమలు చేసే ఐదు గ్యారంటీలకు తెల్ల రేషన్‌కార్డు ప్రమాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు ఫారానికి ఆధార్‌కార్డుతోపాటు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ప్రతీ దరఖాస్తును కంప్యూటరైజ్ చేస్తారు. తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దరఖాస్తుదారు ఏ గ్యారంటీకి అర్హులో నిర్ణయిస్తారు. రేషన్ కార్డు లేనివారు రేషన్‌కార్డు నంబర్ దరఖాస్తు ఫారంలో రాయాల్సి ఉంటుంది. కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
గ్యారంటీల్లో ఉన్నవి ఇవే..
– ఆరు గ్యాంరటీల్లో మహాలక్ష్మి మొదటిది ఇందులో మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
– రైతు భరోసా.. రెండో గ్యాంరటీ ఇది. ఇందులో రైతులకు పెట్టుబడి సాయం రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలి.
– గృహజ్యోతి.. కాంగ్రెస్ మూడో గ్యారంటీ ఇది. దీనిలో భాగంగా 200 యూనిట్ల వరకు గృహాలకు విద్యుత్ ఉచితంగా అందిస్తారు.
– ఇందిరమ్మ ఇళ్లు : పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నారు. స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల సాయం, స్థలం లేని వారికి స్థలంతోపాటు రూ.5 లక్షల సాయం ఇవాలి.
– యువ వికాసం .. ఈ గ్యారంటీ కింద విద్యార్థులకు రూ.5 లక్షల వరకు విద్యా భరోసా కార్డులు అందిస్తారు.
– చేయూత.. ఇక చివరి గ్యారంటీ ఇది. దీనిలో భాగంగా వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు రూ.4 వేల పింఛన్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు.