TELANGANA

రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్ ..

ముఖ్యమంత్రి రేవంత్ రైతు రుణ మాఫీ అమలుపై కీలక ప్రకటన చేసారు. రైతు రుణమాఫీ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. త్వరలోనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకు కార్యాచరణ ఖరారు చేసారు. అదే సమయంలో రైతుబంధు అమల్లోనూ సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటించనున్నారు. రైతు రుణమాఫీ కోసం కార్పోరేషన్ ఏర్పాటు తో పాటుగా నిధుల సమీకరణ పైన నిర్ణయం తీసుకున్నారు.

 

రుణమాఫీ కసరత్తు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తూ రూ 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని నాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది.రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్ర అర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని అమలు మార్గాలపైన కసరత్తు మొదలు పెట్టారు.రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు.. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణ గ్రహీతలుగా ఉన్నారు.

 

పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు రూ.32 వేల కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు.

 

నిధుల సమీకరణ దిశగా: రాష్ట్ర వ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. లెక్కలు – కసరత్తు: రుణ మాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్ చేస్తే దాదాపు 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రూ.2 లక్షల లోపు అప్పు ఉంటే.. మొత్తం మాఫీ అవుతుంది. అంతకంటే ఎంత ఎక్కువ ఉన్నా రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తారు.

 

బ్యాంకర్లతో మాట్లాడి.. ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతోంది. దీని ద్వారా ముందుగా రైతుల పేరుమీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదికి బదలాయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాంగ్‌ టర్మ్‌ పెట్టుకొని.. వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పలా మారిన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు. దీంతో, సీఎం రేవంత్ కొత్త నిర్ణయం అమలుకు నిర్ణయించారు.

 

రైతు బంధు సీలింగ్: రైతు రుణమాఫీ కోసం ఒక ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ముందుగా బ్యాంకు నుంచి రైతురుణమాఫీకి కావాల్సిన నిధులు సమీకరించి..రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వ ఆదాయ శాఖలైన రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ రెవిన్యూ నుంచి ఒక శాతం నిధులను ఆ కార్పోరేషన్ కు బదలాయించటం ద్వారా మూడేళ్ల కాలంలో బ్యాంకులో ప్రభుత్వ రుణం క్లియర్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

 

దీంతో త్వరలోనే రుణమాఫీ అమలుకు కసరత్తు కొనసాగుతోంది. అదే విధంగా రైతు బంధు ధనవంతులకు అమలవుతుందనే విమర్శల నేపథ్యంలో సీలింగ్, అర్హులను తేల్చే అంశం పైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం ప్రకటించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.