TELANGANA

మైక్రాన్ కంపెనీ సీఈవోతో సిఎం రేవంత్ భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ సీఈవో సంజయ్ మెహ్రోత్రాతో గురువారం సిఎం నివాసంలో భేటీ అయ్యారు. అమెరికాలోని మైక్రాన్ టెక్నాలజీస్ కంపెనీ.. ప్రపంచంలోనే అతి పెద్ద మెమోరీ చిప్ తయారీ సంస్థలో ఒకటి. అమెరికా నుంచి సీఈవో సంజయ్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వచ్చారు. మెమోరీ చిప్ తయారీ పరిశ్రమ స్థాపించేందుకు, కంపెనీ పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలంగా ఉందని సంజయ్ తెలిపారు.

 

సిఎం రేవంత్ రెడ్డి కూడా మైక్రాన్ కంపెనీ పరిశ్రమ స్థాపించేందుకు తగిన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమ స్థాపనతో రాష్ట్రంలో ఉపాధి కల్పన, యువతలో నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షను వ్యక్తం చేశారు సెమీ కండక్టర్ మెమోరీ చిప్ల తయారీలో ప్రపంచలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ మైక్రాన్ టెక్నాలజీస్.

 

హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందంతో సిఎం రేవంత్ భేటీ

 

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో తెలంగాణ విచ్చేసిన ఈ అధ్యాపకుల బృందం గురువారం సిఎం నివాసంలో ముఖ్యమంత్రితో మాట్లాడారు. జనవరి 7 నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌షిప్‌ కార్యక్రమం గురించి సీఎంకు హార్వర్డ్ అధ్యాపకులు వివరించారు.

 

రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఒక సంవత్సరం పాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు.. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం ప్రభుత్వానికి సహకరించాలని సీఎం కోరారు.

 

తెలంగాణ విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం ఉస్మానియా యూనివర్సిటీలో 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 10,12వ తరగతి 100 మంది విద్యార్థులకు, అలాగే 33 జిల్లాలకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌షిప్‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు.