NationalTELANGANA

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ పిలుపు..

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం సంభవించింది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది.

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. విచారణలో భాగంగా ఉదయం తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సూచించారు.

 

ఈ కేసులో కల్వకుంట్ల కవిత ఇదివరకు దర్యాప్తును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండుసార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణ నెమ్మదించినట్టే కనిపించింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కవితకు ఈడీ సమన్లు అందలేదు.

 

లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీఆర్ఎస్ సిద్ధమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో- మళ్లీ ఈడీ అధికారులు కవితకు సమన్లు ఇవ్వడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.

 

ఈ పరిస్థితుల్లో కవిత.. ఈడీ సమన్లను అందుకోవడం చర్చనీయాంశమౌతోంది. గతంలో ఇదే ఈడీ అధికారులు.. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలనూ విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్‌కు బాసటగా నిలిచింది బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.

 

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విచారణను ఎదుర్కొంటోన్నారు. ఏడాది కాలంగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతోన్నారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్లన్నింటినీ కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.