TELANGANA

రేవంత్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు – బెర్తులు దక్కేదెవరికి..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ, పాలనా పరంగా వేగంగా తన ఆలోచనలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన రేవంత్..ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

 

మంత్రివర్గ విస్తరణ : ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించారు. మొత్తం 18 మంది వరకు మంత్రివర్గంలో అవకాశం ఉంది. దీంతో, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తరువాతి వారంలో ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ లోగానే పూర్తి కేబినెట్ తో పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు జాబితాకు హైకమండ్ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఫిబ్రవరి తొలి వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.

బెర్తులు దక్కేదెవరికి : ఇక, రేవంత్ మంత్రివర్గంలో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఇప్పుడు ఆ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూనే..సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రులను ఖరారు చేయనున్నారు. అదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. అయితే సామాజిక సమతుల్యతలో వీరికి అవకాశాలు దక్కటం కష్టంగా మారుతోంది. అదే జిల్లా నుంచి వెలమ వర్గానికి చెందిన ప్రేమ సాగర్ రావు, నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు మంత్రి పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఇదే సామాజిక వర్గం నుంచి జూపల్లి మంత్రిగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి , రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఖాయమని చెబుతున్నారు.

రేవంత్ ఛాయిస్ : మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేరు రేసులో ఉంది. మైనార్టీ వర్గానికి అవకాశం ఇవ్వాల్సి ఉండటంతో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కంరగా మారుతోంది. మాదిగ సామాజిక వర్గానికి మరో పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. షబ్బీర్ అలీకి కేబినెట హోదాలోనే సలహాదారుగా నియమించారు. దీంతో, సామాజికంగా సమీకరణాలను పరిగణలోకి తీసుకొని బెర్తులు ఖరారు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే రేవంత్ పీసీసీ చీఫ్ పదవిని కొనసాగిస్తోంది. దీంతో, పూర్తి టీంతో ఎన్నికలకు సమాయత్తం కావాలని రేవంత్ భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎవరికి మంత్రివర్గంలో ఫైనల్ గా అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.